స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా తన మెడకు చుట్టుకుంటాయని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతమంది నేతలు తన పార్టీని వీడి ఇలా షాకుల మీద షాకులు ఇస్తారని ఆయన అస్సలు ఊహించలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ వెళ్లిపోతే ఓకే అనుకోవచ్చు. ఊహించిందే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ సతీష్ రెడ్డి కూడా పార్టీని వీడడం బాబును ఇబ్బందులోకి నెట్టింది. ఇది చాలదన్నట్టు కరణం బలరాం రూపంలో బాబు కోసం ఇప్పుడు ఫ్రెష్ గా మరో షాక్ రెడీ అవుతోంది.
అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే కరణం బలరాం టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడడానికి నిర్ణయించుకున్నారు. రేపోమాపో ఆయన రాజీనామా చేసి ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తారని తెలుస్తోంది. చాన్నాళ్లుగా ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో టచ్ లో ఉన్నారు. అలా సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి చంద్రబాబుకు, బలరాంకు మధ్య సత్సంబంధాలు లేవనే చెప్పాలి. ఎప్పుడైతే తన మాటను పక్కనపెట్టి, గొట్టిపాటి రవికి చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారో, అప్పట్నుంచి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు కరణం బలరాం. ఎన్నికలు ముగిసినప్పట్నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కరణం బలరాం పార్టీని వీడితే చీరాల నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయం. ఇప్పటికే రాష్ట్రంలో మిణుకుమిణుకుమంటోంది టీడీపీ. బలరాం పార్టీ మారితే చీరాలతో ఆ పార్టీ కోలుకోవడం చాలాకష్టం. అయితే బలరాం నేరుగా వైసీపీలో చేరే అవకాశాల్లేవు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తుల్ని తన పార్టీలోకి తీసుకోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు జగన్. అందుకే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి లాంటి నేతలు టీడీపీకి రాజీనామా చేసినప్పటికీ.. అనధికారంగా మాత్రమే వైసీపీలో కొనసాగుతున్నారు.
ఇప్పుడు కరణం బలరాం పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వల్లభనేని వంశీ దారిలో నడవాల్సిందే. అసెంబ్లీలో ఆయన పక్కన కూర్చోవాల్సిందే. అయినా మనసు చంపుకొని టీడీపీలో కొనసాగేకంటే.. రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఉండడం సుఖమని బలరాం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.