వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తమ మాటలకు పదును పెట్టారు. రాజకీయంగా ఎవర్నైనా బలివ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు దళితులు గుర్తొస్తారని విమర్శించారు. ఎక్కడైనా గెలిచే అవకాశం ఉంటే అక్కడ తన వాళ్లకు, కష్టం అనుకున్న చోట దళితులకు అవకాశమిచ్చి చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు విజయసాయి.
“టీడీపీలో చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్ద పీట వేశాడు. బలివ్వాల్సి వచ్చినపుడు మాత్రం దళితులు, బిసిలు గుర్తుకొస్తారు. మోత్కుపల్లి, పుష్పరాజ్, బంగి అనంతయ్య నుంచి ప్రస్తుత వర్ల రామయ్య గారి వరకు అదే తంతు. గెలిచే ఛాన్సున్న దగ్గర తన వాళ్లు, ఓడే ప్రమాదం ఉన్న దగ్గర దళితులు!”
ఇలా చంద్రబాబుపై మరోసారి మాటల తూటాలతో విరుచుకుపడ్డారు విజయసాయి. నిజంగా విజయసాయి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. విశ్వసనీయత అనే పదానికి అర్థమేంటో చంద్రబాబుకు తెలియదన్నారు విజయసాయి. నిజంగా విశ్వసనీయత అంటే ఏంటో జగన్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు.
“విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో దిట్ట. మోపిదేవి, బోస్ ల పార్టీ విధేయతను గుర్తించి సిఎం జగన్ గారు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే నీకూ జగన్ గారికి తేడా.”
కోర్టుకు వెళ్లయినా మందు పంచడానికి అనుమతి తెచ్చుకుంటామంటూ టీడీపీ నేతలు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు విజయసాయి. అడ్రస్ గల్లంతయ్యేముందు ఇలాంటి పిచ్చి ఐడియాలే వస్తాయని, లేకపోతే ఆర్డినెన్స్ చెల్లదని చెప్పడమేంటని సెటైర్ వేశారు విజయసాయి.