ఒకవైపు భారతీయ జనతా పార్టీతో పొత్తు అని జనసేన ప్రకటించింది. స్థానిక ఎన్నికలతోనే బీజేపీతో తమ పొత్తు ప్రయాణం ప్రారంభం అయినట్టుగా జనసేన ప్రకటించింది. తీరా క్షేత్ర స్థాయిలో మాత్రం.. బీజేపీతో పొత్తేమో కానీ, జనసేన-టీడీపీలు పరస్పరం సహకరించుకుంటున్న వైనం మాత్రం బయటపడుతూ ఉంది. చంద్రబాబు కు పవన్ కల్యాణ్ పార్ట్ నర్ అనే పేరుకు తగ్గట్టుగా.. జనసేన, టీడీపీలు పరస్పరం సహకరించుకుంటున్న వైనం కనిపిస్తూ ఉంది.
జనసేనకు ఎలాగూ రాష్ట్రమంతా సీన్ లేదు. గోదావరి జిల్లాల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కొద్దో గొప్పో ఓట్లను సంపాదించుకున్న చోట్ల మాత్రం ఆ పార్టీ తరఫున నామినేషన్లు ఉంటున్నాయి. అది కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతోందట వ్యవహారం. తమ విజయావకాశాలను పరిశీలించి చూసుకుని.. అక్కడ జనసేనను బరిలో ఉంచడమా, వద్దా అనే అంశాలను టీడీపీ వాళ్లు నిర్ణయిస్తున్నారట. ఇలా జనసేన కాస్తో కూస్తో ఉనికి చాటుకోగల గోదావరి జిల్లాల్లో సైతం పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతల ఆదేశానుసారమే నామినేషన్లు దాఖలు అవుతున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే పెద్దాపురం ఏరియాలో అయితే.. జనసేన, టీడీపీలు బాహాటంగానే కలిసి పనిచేస్తూ ఉన్నాయట. అక్కడ ఉమ్మడిగా ఒకరికి ఒకరు సహకరించుకుని ఆ పార్టీలు పోటీ చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ బంధం అప్పుడే ఎంత వరకూ వెళ్లిందంటే.. మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా పంచుకోవాలని ఆ పార్టీల నేతలు డిసైడ్ అయ్యారట. తాము ఉమ్మడిగా మెజారిటీని సాధించి, చైర్మన్ పదవిని చెరో రెండున్నరేళ్ల వరకూ పంచుకోవాలని ఇరు పార్టీల నేతలూ అంగీకారానికి వచ్చారట. ఈ పొత్తు పెద్దమనిషి ఎవరో కాదు, మాజీ మంత్రి చిన్నరాజప్పేనని వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. ఇలా బీజేపీతో పొత్తు అంటూ, తెలుగుదేశంతో సంసారానికి జనసేన సై అని అంటూ ఉండటం గమనార్హం!