కరోనాపై ప్రజల్లో అవగాహన నింపేందుకు సినీ సెలబ్రిటీలు బాగానే స్పందించేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు సినిమా వాళ్లు ఈ తరహాలో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించగా, ఇప్పుడు ఈ జాబితాలో విజయ్ దేవరకొండ కూడా చేరారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ ఒక వీడియోలో కనిపించి, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు.
విశేషం ఏమిటంటే.. ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రూపొందించినది. కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన నింపడానికి ప్రభుత్వాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా విజయ్ తో ఈ వీడియోను రూపొందించినట్టుగా ఉన్నారు. షేక్ హ్యాండ్ వద్దని, ఎవరినైనా కలిసినప్పుడు నమస్కారమే మేలని, జలుబు లక్షణాలతో ఉన్న వారికి దూరంగా ఉండాలని.. ఆ వీడియోలో చెప్పారు.
మరోవైపు కరోనా భయాలో కొనసాగుతూ ఉన్నాయి. బెంగళూరులో ఒక టెకీలో కరోనా లక్షణాలు గుర్తించడంతో.. అక్కడ ఆందోళన మొదలైంది. అతడు అంతకు ముందు ఎవరెవరితో కలిశాడనే అంశం గురించి వాకబు చేస్తే దాదాపు 60 మంది తేలారట! వారందరూ ఇప్పుడు పరీక్షలకు, పరిశీలనల్లో ఉన్నట్టున్నారు. ఏపీలో మాత్రం కరోనా వైరస్ కేసులేవీ రిజిస్టర్ కాలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.