రంగుల‌పై ‘దిశ’ మార్చుకోని జ‌గ‌న్ స‌ర్కార్‌

ఒక వైపు ఎవ‌రెన్ని అభ్యంత‌రాలు చెబుతున్నా జ‌గ‌న్ స‌ర్కార్ ఆ ఒక్క విష‌యంలో మాత్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోడానికి ససేమిరా అంటోంది. స్వ‌యంగా రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం నిన్న (మంగ‌ళ‌వారం) రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ, ప్రభుత్వ…

ఒక వైపు ఎవ‌రెన్ని అభ్యంత‌రాలు చెబుతున్నా జ‌గ‌న్ స‌ర్కార్ ఆ ఒక్క విష‌యంలో మాత్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోడానికి ససేమిరా అంటోంది. స్వ‌యంగా రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం నిన్న (మంగ‌ళ‌వారం) రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు అద్దిన వైసీపీ పతాకాన్ని పోలిన రంగుల్ని తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. అంతేకాదు పది రోజుల్లో ఆ రంగులు తీసేయాల్సిందేన‌ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ స‌ర్కార్ వైఖ‌రిలో ఏ మాత్రం మార్పురాలేదు. స‌రిక‌దా, రంగులు వేయ‌డాన్ని కొన‌సాగిస్తూనే ఉంది.

రంగుల తొల‌గింపుపై తీర్పు వ‌చ్చిన రోజే క‌ర్నూలులో ‘దిశ’ పోలీస్‌స్టేష‌న్‌కు వైసీపీ జెండా రంగుల‌ను కొట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. అంతేకాదు, ఈ దిశ పోలీస్‌స్టేష‌న్‌ను ప్ర‌జ‌ల విరాళాల‌తో క‌ట్టించారు. ఈ పోలీస్ స్టేష‌న్ నిర్మాణానికి  టీడీపీ క‌ర్నూలు ఇన్‌చార్జ్ టీజీ భ‌ర‌త్   రూ.10 ల‌క్ష‌లు, గ్రీన్‌కో ఫౌండేష‌న్‌, రామ్‌కో సిమెంట్స్‌, శ్రీ జ‌య‌జ్యోతి సిమెంట్స్ త‌దిత‌ర సంస్థ‌ల‌కు చెందిన వాళ్లు రూ.28.40 ల‌క్ష‌లు విరాళాల కింద ఇచ్చారు.

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో నిర్మాణానికి నోచుకున్న దిశ పోలీస్‌స్టేష‌న్‌కు కూడా వైసీపీ రంగులు వేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బ‌హుశా అధికారుల అత్యుత్సాహం…చివ‌రికి జ‌గ‌న్ స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు తీసుకొస్తోంద‌ని వైసీపీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు కోర్టు తీర్పులంటే జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఏ మాత్రం గౌర‌వం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.  

ప్ర‌భుత్వ భ‌వ‌నాలకు ఒక రాజ‌కీయ పార్టీ రంగుల తొల‌గింపుపై త‌మ‌ ఆదేశాలు అమ‌లు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అంతేకాదు ఇందులో విఫలమైతే పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శితో పాటు సీఎస్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంద‌ని న్యాయ‌స్థానం హెచ్చ‌రించింది.

రాజకీయ పార్టీలకు చెందిన రంగులతో ఏమాత్రం సారూప్యత లేని రంగులను పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు వేసేందుకు అనువుగా సీఎస్‌ తగిన మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో దిశ పోలీస్‌స్టేష‌న్‌కు వైసీపీ రంగులు పుల‌మ‌డంపై హైకోర్టు సీరియ‌స్‌గా స్పందించే అవ‌కాశాలు లేక‌పోలేదు. త‌ప్ప‌ని తెలిసి కూడా …ఇలాంటి ప‌నులు ఎందుకు పున‌రావృతం అవుతున్నాయో అర్థం కాని ప‌రిస్థితి. జ‌గ‌న్ స‌ర్కార్ ఇలాంటి విష‌యాల‌పై సీరియ‌స్‌గా దృష్టి పెట్టి…పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?