దేవుడా నాగ‌బాబు మ‌న‌సు మార్చు!

నాగ‌బాబుకు ఏమీ ప‌నీలేకో, లేక రాజ‌కీయంగా  ఎటూ చెల్ల‌కుండా అయిపోయామ‌నే బాధో తెలియ‌దు కానీ, ఆయ‌న ఇటీవ‌ల పొంత‌న లేని, అర్థంప‌ర్థం లేని ట్వీట్లు చేస్తున్నాడు. జ‌న‌సేనాని అన్న‌గా నాగ‌బాబు పార్ల‌మెంట్ స్థానానికి పోటీ…

నాగ‌బాబుకు ఏమీ ప‌నీలేకో, లేక రాజ‌కీయంగా  ఎటూ చెల్ల‌కుండా అయిపోయామ‌నే బాధో తెలియ‌దు కానీ, ఆయ‌న ఇటీవ‌ల పొంత‌న లేని, అర్థంప‌ర్థం లేని ట్వీట్లు చేస్తున్నాడు. జ‌న‌సేనాని అన్న‌గా నాగ‌బాబు పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అంతేకాదు ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోకు జ‌డ్జిగా సుదీర్ఘ కాలం వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు…ఇటీవ‌ల అక్క‌డి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆ షో నిర్మాత‌తో వ‌చ్చిన విభేదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

బ‌హుశా ఆ షో నుంచి త‌ప్పుకోవ‌డం కూడా నాగ‌బాబు బాగా ఒత్తిడికి గురి కావ‌డానికి కార‌ణంగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అడ‌పాద‌డ‌పా ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై స్పందిస్తున్నాడు. త‌న పెద్ద‌న్న‌, మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగిన నేప‌థ్యంలో కూడా ఆయ‌న చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆ ట్వీట్ మెగా ఫ్యామిలీకి డ్యామేజీ క‌లిగించింద‌నే చ‌ర్చ న‌డిచింది.

తాజాగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు.

“లైఫ్ ఇస్తాన‌న్న వాడిని ఓడిస్తారు, లైఫ్ తీసుకునే వాళ్ల‌ని అధికార‌, ప్ర‌తిప‌క్షాలుగా ఎన్నుకుంటారు. ఏమిటో ఈ జ‌నం. దేవుడా ఈ జ‌నాల మ‌న‌సు మార్చు (భ‌విష్య త‌రాల కోసం)” అంటూ నాగ‌బాబు ట్వీట్ చేశాడు.

నాగ‌బాబు దృష్టిలో లైఫ్ ఇస్తాన‌న్న వాడిని ఓడిస్తారంటే త‌న సోద‌రుడు, జ‌న‌సేనాని ఓడించార‌నే బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచారని అర్థం చేసుకోవాలి. అలాగే లైఫ్ తీసుకునే వాళ్ల‌ని అధికార , ప్ర‌తిప‌క్షాలుగా ఎన్నుకుంటారంటే…వైసీపీ, టీడీపీల‌ను అధికార‌, ప్ర‌తిప‌క్షాలుగా ఎన్నుకున్నార‌ని నాగ‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఆయ‌న అంత‌టితో ఆగ‌లేదు. జ‌నాన్ని కూడా నిందించాడు. ఈ జ‌నాల మ‌న‌సు మార్చాలంటూ దేవుడికి విన్న‌వించుకున్నాడు.

ఏనాడూ జ‌నాల మ‌ధ్య ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా గ‌డ‌ప‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప‌ట్టం క‌ట్ట‌ని జ‌నాన్ని నిందించ‌డం స‌బ‌బేనా? అయినా జ‌నం స‌మ‌స్య‌ల కోసం త‌న సోద‌రుడు జ‌న‌సేనాని పోరాడిన సంద‌ర్భం ఏమిటో నాగ‌బాబు చెప్ప‌గ‌ల‌రా?  కేవ‌లం పార్టీ పేరు జ‌న‌సేనాని అని పెట్టుకున్నంత మాత్రాన జ‌నంతో సంబంధం ఉన్న‌ట్టేనా? లైఫ్ ఇస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌గానే…పోలోమ‌ని జ‌నం ఓట్లు వేసి గెలిపిస్తారా? జ‌నంతో సంబంధం లేని వాళ్ల నుంచి వ‌చ్చే ట్వీట్లు ఇలాగే ఉంటాయి మ‌రి! ఏమిటో ఈ నాగ‌బాబు. దేవుడా…మున్ముందు ఇలాంటి అర్థం లేని ట్వీట్లు మున్ముందు నాగ‌బాబు నుంచి రాకుండా, ఆయ‌న‌లో మార్పు తీసుకురావాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు . ఎందుకంటే జ‌న‌సేన భ‌విష్య‌త్ కోసమైనా అని వారు అంటున్నారు.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?