ప్రతిపక్షాల కంటే మీడియా సంస్థల అధిపతులు ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారు. తాము లేనిదే రాజకీయాలు, పార్టీల ఉనికే లేదనే భ్రమలో మీడియాధిపతులున్నారు. టీడీపీ ఎజెండాని ఈనాడు వ్యూహాత్మకంగా అమలు చేస్తూ వుంటుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏఏ మీడియా సంస్థలు ఎవరెవరికి అనుకూలమో, వార్తల వెనుక అజెండా ఏమిటో వెంటనే తెలిసిపోతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల అంశం తెరపైకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యూహాత్మకంగా ఎల్లో మీడియా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ “ఈనాడు” బ్యానర్ “నాటి గర్జనలేవీ?” శీర్షికతో ప్రచురితమైన కథనం. ఎల్లో మీడియాకు, టీడీపీ నేతలకు నిజంగా ప్రత్యేక హోదాపై ప్రేమ వుండి, జగన్‌పై ఒత్తిడి చేస్తే సంతోషించాల్సిందే. అయితే వాళ్ల ఉద్దేశం అది కానే కాదు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని వైసీపీ షరతు విధించాలని ఎల్లో గ్యాంగ్ డిమాండ్ చేసే నైతిక హక్కు ఉందా?
ప్రత్యేక హోదా ఇస్తే, ఏం వస్తుందని నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాడు ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నారు. బాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే, నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. నాడు బాబు తానా అంతే, ఇప్పుడు జగన్‌ను ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియా తందానా అంటూ కథనాలు రాయడం, చానళ్లలో ప్రసారం చేయడం నిజం కాదా? ఒకప్పుడు ప్రత్యేక హోదాపై విపక్ష నేతగా జగన్ దూకుడు ప్రదర్శించారని నేడు గుర్తు చేసిన ఈనాడు పత్రిక, నాడు ఆ వార్తల్ని ప్రచురించిందా? అంటే అనుమానమే.
వైసీపీ షరతు డిమాండ్ వెనుక ఎల్లో మీడియా అసలు వ్యూహం ఏంటంటే… తద్వారా బీజేపీకి వైసీపీని దూరం చేయడమే. నాడు మోదీ ప్రభ మసకబారుతోందని, ఎన్‌డీఏ నుంచి వైదొలగకపోతే ఆ నెగెటివ్ టీడీపీపై పడుతుందని ఇదే ఎల్లో మీడియాధిపతులు చంద్రబాబును భయపెట్టి, దూరం చేశారనే ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం కాదా? ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేతగా జగన్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా పిల్లిమొగ్గలు వేశారో ఈనాడు పత్రిక వివరంగా రాసుకొచ్చింది.
లోక్‌సభలో 22 మంది ఎంపీలు, అలాగే రాజ్యసభలో 9 మంది సభ్యులు, అసెంబ్లీలోనూ ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు న్నారని ఎల్లో మీడియా గుర్తు చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీకి 45,525 ఓట్లు ఉన్నాయని, ప్రతి ఓటూ కీలకమైన తరుణంలో వైసీపీ మద్దతు ఎంతో అవసరమని, కావున ప్రత్యేక హోదా సాధించేందుకు ఇదే సరైన సమయమని ఈనాడు పత్రిక గుర్తు చేస్తోంది.
అంతేకాదు, వైసీపీ ఇప్పుడు ఏం కోరినా కేంద్రం దిగిరాక తప్పదని ఈనాడు రెచ్చగొడుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఈ సువర్ణావకాశాన్ని వైసీపీ వినియోగించాలని మరీమరీ చెబుతోంది. ప్రత్యేక హోదా ఇస్తే, రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు కలిగే మాట నిజమే. అయితే ఈ హితవు, హెచ్చరిక నాడు కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టేటపుడు మీడియాధిపతులంతా ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
చంద్రబాబు అధికారంలో వుంటే ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుందనే నినాదానికి మద్దతు పలికిన ఎల్లో మీడియా కూడా ఇవాళ జగన్ ఏం చేయాలో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ దురుద్దేశాలతో రాసే ఇలాంటి కథనాల వల్ల ప్రయోజనం వుండదు. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టగా, నేడు జగన్ దాన్ని అటకెక్కించారు. రాజకీయ స్వార్థానికి రాష్ట్ర ప్రయోజనాలు సమాధి అవుతున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ప్రత్యేక హోదా. రాజకీయ పార్టీలు, నేతలు వేర్వేరైనా, వారి అంతిమ లక్ష్యం అధికారం. ప్రజలు ఎప్పటికైనా పావులే. ఇప్పుడు అదే జరుగుతోంది.
ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న వాళ్లే, నేడు తమకు నచ్చని పాలకుడు వుండడంతో గొంతెత్తి అరవడం గమనార్హం. ఇలాంటి కథనాలకు భయపడి జగన్ వెంటనే షరతు విధిస్తారనుకోవడం రామోజీ భ్రమ.
సొదుం రమణ