గతంలో కాంగ్రెస్ పార్టీ తనకు ఎదురే లేదనుకుంది. అప్పట్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా… ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీజేపీ గద్దెనెక్కడానికి, నిలబడడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ ని మించిపోయింది. ఈడీని ఉసిగొల్పడంలో, సీబీఐని ఉపయోగించి కక్ష తీర్చుకోవడంలో అందెవేసిన చేయి అని నిరూపించుకుంది.
ఈ దశలో బీజేపీకి చెక్ పెట్టాలంటే కచ్చితంగా మరోసారి విపక్షాలన్నీ ఏకం కావాలి. కానీ ఇప్పుడు కూడా అదే సమస్య.. గతంలో విపక్షాల అనైక్యత కాంగ్రెస్ కి ఎలా కలిసొచ్చిందో.. ఇప్పుడు కూడా విపక్షాల అనైక్యత బీజేపీకి వరంలా మారింది. కాషాయదళం మాటల్లో చెప్పాలంటే.. వారికి అదే శ్రీరామరక్ష.
2024లో బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే చోటకు చేర్చి మోదీని గద్దె దించాలనేది అందరి ఆలోచన. కేజ్రీవాల్, మమతా, స్టాలిన్, కాంగ్రెస్.. ఇలా అందరి వ్యూహం అదే. కానీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా తమ సత్తా చూపిద్దామనుకుంటే అది కూడా కుదిరేలా లేదు. దీదీపై వంకపెట్టి కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. కేసీఆర్ అసలే రానన్నారు. ఇదే కదా మోదీకి కావాల్సింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు.. ప్రతిపక్షాలన్నీ వారిలో వారే కొట్లాడుకుంటే.. మోదీ మాత్రం తమాషా చూస్తారనమాట.
రాష్ట్రపతి ఎన్నికలే గీటురాయి..
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కచోటకు చేరి, తటస్థ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఉంటే.. కచ్చితంగా ఆ పార్టీ నిలబెట్టే అభ్యర్థి ఓటమిపాలవుతారు. కానీ బీజేపీ వ్యవహారాన్ని అంతదూరం రానిచ్చేలా లేదు. ఈలోపుగానే ఎక్కడికక్కడ బుజ్జగింపులు మొదలయ్యాయి, బెదిరింపులు షురూ అయ్యాయి. ఇక ప్రతిపక్షాల్లో చీలిక స్పష్టంగా ఉంది.
కాంగ్రెస్ ఉంటే నేను రానంటున్నారు కేసీఆర్, దీదీ నాయకత్వాన్ని నేను ఒప్పుకోనంటున్నారు కేజ్రీవాల్. కనీసం మీటింగ్ కే రాకుండా ముడుచుకు కూర్చున్న వీరు.. రేపు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారంటే ఎలా నమ్మాలి..? ఎందుకు నమ్మాలి..? ఆ సమయానికి తమకి రాజకీయంగా ఏది లాభమో అదే చేస్తారు కానీ, అందరూ ఒక్కమాట మీదే ఉందామనే బలమైన ఆకాంక్ష వీరికి లేదు.
అందరూ ప్రధాని అభ్యర్థులే..
భారత్ కు ప్రధాని కావాలనే ఆశ మమతా బెనర్జీకి ఉంది, కేజ్రీవాల్ కి కూడా అదే ఉంది, ఇటీవల కేసీఆర్ కూడా తాను భావి ప్రధాని అయితే తప్పేంటి అంటున్నారు. అందుకే అందరూ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు. ఇలా లోక్ సభ ఓట్లు, చీలికలు, పేలికలు అయితే చివరకు బీజేపీయే దిక్కవుతుంది. 2024లో అదే నిజయ్యేలా ఉంది. రేట్లు పెరిగిపోయాయనే బాధ సామాన్య ప్రజల్లో ఉన్నా.. అవస్థలు పడుతున్నామనే ఆలోచన వారిని తొలిచేస్తున్నా.. ప్రతిపక్షాల్లో ఉన్న అనైక్యత వల్ల ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.
మరోవైపు మమత, శరద్ పవార్ లాంటి నేతలు మాత్రం ఐక్యత కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసినప్పటికీ.. 2024 ఎన్నికలకు ఈ ఐక్యత, ఓ సూచికగా మారుతుంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సభ్యులు.. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరితో చర్చలు జరుపుతారు.
రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఈ పార్టీల మధ్య సఖ్యత ఏర్పడితే అదో పెద్ద ముందడుగు అవుతుంది. 2024 ఎన్నికల కోసం సిద్ధమౌతున్న బీజేపీకి పెద్ద హెచ్చరికగా మారుతుంది. కానీ ఆ ఐక్యత ప్రస్తుతానికి ఎక్కడా కనిపించడం లేదు.