ఒక ఊరు రాజు మరో ఊరి బంటు అని సామెత ఊరికే పుట్టలేదు. సినిమాల్లో కింగ్ ల్లా వున్నవారు రాజకీయాల్లో బఫూన్ లు అవుతారు. బడా బడా పారిశ్రామిక వేత్తలు సినిమాల్లోకి వచ్చి, ఫెయిల్ అవుతారు. పెద్ద తెరమీద క్లిక్ కాని వాళ్లు చిన్న తెర మీద వెలుగుతారు. చిన్న తెర సూపర్ స్టార్ లు పెద్ద తెర మీద రిజెక్ట్ అవుతారు. ఇవన్నీ ఇప్పటికే ప్రూవ్ అయిపోయిన సత్యాలు.
సుమ కనకాల చిన్న తెరపై తన కెరీర్ ప్రారంభించింది. ఆదిలోనే దర్శకుడు దాసరి ఆమెను పెద్ద తెరకు పరిచయం చేసే ప్రయత్నం చేసారు. కానీ విజయం వరించలేదు. అప్పటి నుంచి చిన్న తెర మీదే పెద్దగా దృష్టి పెట్టి, అక్కడ సూపర్ స్టార్ అయిపోయింది. సుమ అంటే సినిమా ఇండస్ట్రీకే పెద్ద క్రేజ్. హీరోలు, దర్శకులు అందరికీ ఓ రేంజ్ క్రేజ్. కానీ సినిమా వైపు మాత్రం చూడలేదు.
ఇటీవల సరైన పాత్ర దొరికితే జయమ్మ పంచాయతీ సినిమాను సుమ ఒప్పుకుంది. పూర్తి చేసింది. ఆ సినిమా కోసం సుమ ఇంతా అంతా కష్టపడలేదు. ఓ రేంజ్ లో కష్టపడి ప్రమోట్ చేసింది. ఆ సినిమాతో తను టాలీవుడ్ లో ఓ స్థానం తెచ్చుకుంటా అనుకుంది. మరిన్ని సినిమాలు చేసే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసింది సుమ.
కానీ జయమ్మ మంచి క్లీన్ సినిమా అనిపించుకుంది కానీ కరోనా తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో డిజాస్టర్ అయిపోయింది. జనాలు అస్సలు అదో సినిమా కూడా వచ్చిందని పట్టించుకోలేదు.దాంతో సుమ పూర్తిగా డీలా పడిపోయి, మళ్లీ మరోసారి సినిమాలు చేసే ఆలోచన కూడా వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తను సక్సెస్ ఫుల్ గా వున్న చిన్న తెర మీదనే కొనసాగాలని, సినిమా ఫంక్షన్లు ఎలాగూ వుంటాయని సుమ డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కొంత మంది కొత్త స్క్రిప్ట్ లు తెచ్చినా సుమ నో చెబుతున్నట్లు తెలుస్తోంది.