పచ్చమీడియా ఇప్పుడు కొత్తపాట ఎత్తుకుంది? రాష్ట్రపతి ఎన్నిక సమయంలో.. జగన్ కేంద్రంలోని బిజెపికి షరతు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేనే బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తామని.. లేకపోతే ఓటు వేయం అని డిమాండ్ చేయాలని.. ఈ ఎన్నిక ప్రత్యేకహోదా సాధించడానికి ఒక సువర్ణావకాశం అని జగన్ సర్కారుకు హితబోధ చేస్తోంది.
పచ్చమీడియా.. ఎంతటి పచ్చ కామెర్లరోగంతో సతమతం అయిపోతోందో.. ఈ వ్యవహారమే పెద్ద ఉదాహరణ. అయిదేళ్లు పాలన సాగించిన చంద్రబాబునాయుడు.. ప్రతిసారీ కేంద్రంలోని బిజెపికి తొత్తుగానే వ్యవహరించాడు. ఏనాడూ ప్రత్యేకహోదా గురించి గట్టిగా పట్టుబట్టలేదు. ప్యాకేజీ పేరుతో కేంద్రం విదిలించే డబ్బు దండుకోడానికి హోదా అనే ఉద్యమస్పూర్తిని పాతిపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అనే అభిప్రాయం అప్పటి హోదా ఉద్యమకారులు అందరిలోనూ ఉంది. అలాంటి చంద్రబాబునాయుడుకు ఈ మీడియా ఎన్నడూ ఇలాంటి హితబోధలు చేయలేదు.
సరే పరవాలేదు.. అప్పడు ఆ మీడియా కూడా చంద్రబాబు చంక యెక్కి పాలన సాగిస్తున్నది గనుక.. ఆయనను సలహాలు చెప్పలేదు. ఇప్పుడు జగన్ మీద బురద చల్లడం లక్ష్యంగా పనిచేస్తున్నది గనుక.. సలహా చెబుతున్నది అనుకుందాం. కానీ.. జగన్ రాష్ట్రపతి ఎన్నికలో బిజెపికి అనుకూలంగా ఓటు వేయకపోతే.. ప్రత్యేక హోదా డిమాండ్ ను గట్టిగా వినిపిస్తే .. జగన్ దేవుడని ఈ మీడియా కీర్తిస్తుందా? జగన్ అంతటి చిత్తశుద్ధి గల నాయకుడు మరొకడు లేడని.. ఘంటాపథంగా ప్రజలకు చెప్పగల దమ్ము ఈ పచ్చ మీడియాకు ఉందా? అనేది ప్రజల్లో మెదలుతున్న సందేహం.
బిజెపి అభ్యర్థి రాష్ట్రపతిగా గెలవడానికి వారి కూటమికి వెలుపల ఉన్న పార్టీల మద్దతు కూడా అవసరం అన్నది చాలా స్పష్టం. అంతమాత్రాన.. ఆ వెలుపలి మద్దతు కొంత తగ్గినంత మాత్రాన వారు ఓడిపోతారా? అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బిజెపి కూటమిలో లేనంత మాత్రాన.. ఒడిశా నవీన్ పట్నాయక్.. బిజెపికి అనుకూలంగానే ఓటు వేస్తారు. మరికొన్ని చిన్నా చితకా పార్టీలు, స్వతంత్ర సభ్యులు కూడా అనుకూల ఓటు వేసే అవకాశం ఉంది. అసలే విప్ కూడా లేని ఈ ఎన్నికల్లో.. బిజెపి తమకు అవసరమైనన్ని ఓట్లను విపక్షాల నుంచి కూడా చాటుమాటుగా రాబట్టుకునే అవకాశమూ పుష్కలంగా ఉంది.
ఇలాంటి నేపథ్యంలో జగన్.. వైసీపీ ప్రత్యేకహోదా డిమాండ్ తో రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ కు దూరంగా ఉంటే.. వారి చిత్తశుద్ధిని అభినందిస్తారా? అనేది ప్రశ్న. జగన్ ఓటింగుకు దూరంగా ఉన్నా కూడా బిజెపి నెగ్గుతుంది! కానీ, అలా చేయడం వలన హోదా వస్తుందనే గ్యారంటీ ఈ పచ్చ మీడియా ఇవ్వగలుగుతుందా? అలా చేయడం వలన.. కేంద్రంతో సత్సంబంధాల ద్వారా.. అంతో ఇంతో రాష్ట్రానికి రాబడుతున్న నిధులు కూడా కోల్పోయే స్థితి వస్తే.. ఈ పచ్చమీడియా ఏంచేస్తుంది? అనేది ప్రశ్న.
హోదా అనేది చంద్రబాబునాయుడు చేజేతులా చంపేసిన డిమాండ్. అది మాటలకు, ప్రకటనలకే తప్ప ఎన్నటికీ రాకుండా ఆయన చేసేశారు. దాని మీద ఇలాంటి వంటావార్పూ కథనాలు ఇవ్వడం సిగ్గుచేటు తప్ప మరొకటి కాదు.