బిగ్ బితో మరోసారి ఆర్జీవీ సినిమా

బిగ్ బి అమితాబ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. వర్మ ఎప్పుడు సంప్రదించినా, కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటానని గతంలోనే ప్రకటించారు అమితాబ్. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్…

బిగ్ బి అమితాబ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. వర్మ ఎప్పుడు సంప్రదించినా, కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటానని గతంలోనే ప్రకటించారు అమితాబ్. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. అమితాబ్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉందని ప్రకటించాడు వర్మ.

ప్రస్తుతం కొండా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వర్మ, ప్రచారంలో భాగంగా బాలీవుడ్ సినిమాలపై స్పందించాడు. తను ఇప్పటికీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నానని, వచ్చే నెలలో విడుదల కాబోతున్న లడకీ అనే చిత్రాన్ని కూడా హిందీలోనే తీశానని స్పష్టంచేశాడు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ తో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయాన్ని బయటపెట్టాడు.

బిగ్ బి, ఆర్జీవీ కాంబినేషన్ లో గతంలో సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్-3, ఆగ్, నిశ్శబ్ద్ లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో సర్కార్ సినిమా సంచలన విజయం సాధించగా.. నిశ్శబ్ద్ సినిమా కేవలం సంచలనాలు మాత్రం సృష్టించింది. మళ్లీ ఇన్నేళ్లకు బిగ్ బితో మరో సినిమా ప్లాన్ చేశాడు వర్మ.

ఈసారి అమితాబ్ కోసం తనకు ఎంతో ఇష్టమైన హారర్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు వర్మ. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతానని స్పష్టం చేశాడు.

అయితే వర్మ ఘనంగా ప్రకటించినప్పటికీ, అతడి సినిమాలు సెట్స్ పైకి వచ్చేవరకు నమ్మలేం. ఇప్పటికే చాలా సినిమాల్ని అలా ప్రకటించి ఇలా వదిలేశాడు ఈ దర్శకుడు. సో.. బిగ్ బితో చేయబోయే సినిమా కేవలం ప్రకటనతోనే ఆగిపోతుందా, కార్యరూపం దాలుస్తుందా అనేది చూడాలి.