హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ లాంటివేం చూడలేదు రానా. ఓ కథ తన మనసుకు నచ్చితే చేసుకుంటూ వెళ్లిపోయాడంతే. ఓ హీరోగా ఎదగడం కంటే, నటుడిగా నిరూపించుకోవడానికే ఇన్నాళ్లూ ప్రయత్నించాడు. విలన్ గా చేసింది కూడా ఇందులో భాగమే.
అలా కెరీర్ లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న రానా, ఇకపై ప్రయోగాలు చేయనని ప్రకటించాడు. ఇన్నాళ్లూ తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేశానని, ఇకపై ఫ్యాన్స్ కు నచ్చే సినిమాలు మాత్రమే చేస్తానని ప్రకటించాడు.
“విక్టరీ వెంకటేష్ అభిమానులే నాక్కూడా ఉంటారనుకున్నాను. నాకంటూ ఫ్యాన్స్ ఉంటారని అనుకోలేదు. నాకేవో కథలు నచ్చాయి, కొత్త కథలతో ఏవో సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థమైంది. విరాటపర్వం లాంటి సినిమాలు చేయొద్దని నాకు చెబుతున్నారు. ఓ నటుడిగా ఇదే నా చివరి ప్రయోగం. ఇకపై ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తాను. పిచ్చెక్కిచ్చేద్దాం.”
ఇక్కడ 'పిచ్చెక్కిచ్చేద్దాం' అంటే అర్థం మాస్-మసాలా యాక్షన్ సినిమాలే అనుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఇలాంటి సినిమాలకే జనాదరణ, పైగా పాన్-ఇండియా అప్పీల్ కూడా వీటికే. అందుకే రానా కూడా విరాటపర్వం సినిమాతో ప్రయోగాలు ఆపేస్తానంటున్నాడు. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎక్కువగా ఉండే సినిమాలు చేస్తానంటున్నాడు.
కెరీర్ లో ఎన్నో మంచి పాత్రలు పోషించాడు రానా. నేనే రాజు నేనే మంత్రి, బాహుబలి, లీడర్, కృష్ణంవందే జగద్గురుం, ఘాజీ, అరణ్య, భీమ్లానాయక్ సినిమాల్లో రానా పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఫ్యాన్స్ కు నచ్చేలా సినిమాలు చేస్తానంటున్న ఈ హీరో, ఇకపై ఇలాంటి విలక్షణ పాత్రలకు దూరమౌతాడేమో.. మూస పాత్రలు చేస్తూ, ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోతాడేమో..?