అక్రమ సంబంధం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఈ వివాహేతర సంబంధం వల్ల ఒకరు ప్రాణం పోగొట్టుకోగా, మరొకరు జైలు పాలయ్యారు. కడప జిల్లాలో జరిగింది ఈ ఘటన.
కడపలో ఉంటున్న రవికి, ఐదేళ్ల కిందట అనురాధతో పెళ్లయింది. భర్తతో చక్కగా కాపురం చేసుకుంటున్న అనురాధ, ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. అంతలోనే ఈ కుటుంబంలోకి ఇమ్మానియేల వచ్చాడు. ఇతడి రాకతో ఆ కుటుంబంలో చిచ్చురేగింది.
ఇమ్మానియేల్ కు దగ్గరైంది అనురాధ. భర్తకు తెలియకుండా అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తను, ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఇమ్మానియేల్ తో వెళ్లిపోయింది. ఇద్దరూ వెళ్లి పొద్దుటూరుకు పారిపోయి, కొత్త సంసారం ప్రారంభించారు.
ఈ విషయం తెలుసుకున్న రవి, ఇమ్మానియేల్ ఇంటికి వెళ్లాడు. తన కాపురంలో చిచ్చుపెట్టడం మంచిది కాదని, తల్లి కోసం పిల్లలు ఏడుస్తున్నారని, అనురాధను తనతో పంపించాలని కోరాడు. కానీ రవితో తిరిగి ఇంటికి వెళ్లేందుకు అనురాధ అంగీకరించలేదు. రవి ఎన్నిసార్లు బతిమిలాడినా అనురాధ-ఇమ్మానియేల్ ఒప్పుకోలేదు.
దీంతో ఇమ్మానియేల్ పై కోపం పెంచుకున్నాడు రవి. తన కాపురంలో చిచ్చుపెట్టిన అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇటుకల బట్టి వద్ద ఒంటరిగా నిద్రిస్తున్న ఇమ్మానియేల్ పై కత్తితో దాడిచేసి హత్య చేశాడు.
ఈ కేసును 24 గంటల వ్యవథిలో ఛేదించారు పోలీసులు. రవితో పాటు, హత్యకు అతడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలా ఓ అక్రమ సంబంధం ఒకర్ని పొట్టనపెట్టుకుంటే, మరొకరు జైలు పాలయ్యారు.