ర‌ఘురామపై అత్యుత్సాహం…న‌వ్విపోతున్నారే!

స‌రిహ‌ద్దుల్లో  ఏపీ అంబులెన్స్‌ల‌ను తెలంగాణ పోలీసులు అడ్డుకోవ‌డం కంటే టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నేత‌ల‌కు వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును అరెస్ట్ చేయ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. గ‌త వారం రోజులుగా ఏపీ అంబులెన్స్‌ల‌ను స‌రిహ‌ద్దుల్లో…

స‌రిహ‌ద్దుల్లో  ఏపీ అంబులెన్స్‌ల‌ను తెలంగాణ పోలీసులు అడ్డుకోవ‌డం కంటే టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నేత‌ల‌కు వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును అరెస్ట్ చేయ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. గ‌త వారం రోజులుగా ఏపీ అంబులెన్స్‌ల‌ను స‌రిహ‌ద్దుల్లో అడ్డుకుంటుండంతో రోగులు, వారి బంధువులు మాన‌సికంగా తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. 

ఈ స‌మ‌స్య‌పై స్పందించాల‌ని స‌రిహ‌ద్దుల్లో నిలిచిపోయిన అంబులెన్స్‌ల్లోని రోగులు, వారి కుటుంబ స‌భ్యులు చేతులెత్తి వేడుకుంటున్నారు. వారి ఆర్త‌నాదాలు ఏ ఒక్క‌రికీ వినిపించ‌డం లేదు, క‌నిపించ‌డం లేదు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు, ఇత‌ర ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, సోము వీర్రాజు త‌దిత‌రులెవ‌రూ ఎక్క‌డా అంబులెన్స్‌ల అడ్డ‌గింత‌పై స్పందించిన దాఖ‌లాలు లేవు. 

ప్ర‌ధాని మోదీకి మాత్ర‌మే జ‌గ‌న్‌, చంద్ర‌బాబు భ‌య‌ప‌డ‌తార‌ని ఇంత కాలం అనుకున్నామ‌ని, చివ‌రికి కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్య‌తిరేక విధానాల‌ను త‌ప్పు ప‌ట్టేందుకు కూడా వెనుకాడుతున్నార‌ని అంబులెన్స్ స‌మ‌స్య చెప్ప‌క‌నే చెప్పింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వేళ ఒక‌రిద్ద‌రు ద్వితీయ శ్రేణి టీడీపీ నాయ‌కులు స్పందించినా …అది జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

ఇదే వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును నిన్న సాయంత్రం అరెస్ట్ చేయ‌గానే ఒక్క‌సారిగా ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లంతా బ‌య‌టి కొచ్చారు. ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్ చేయ‌డాన్ని ఖండిస్తూ చంద్ర‌బాబు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

పుట్టిన రోజు నాడే ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులతో అరెస్టు చేయించడం సీఎం జగన్‌రెడ్డి ఉన్మాదానికి నిదర్శన మ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఒక ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏకంగా దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశార‌ని ఆయ‌న వాపోయారు. ఇదే విష‌య‌మై లోకేశ్‌, అచ్చెన్నాయుడు, ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌, గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తూర్పార ప‌ట్టారు.

ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్‌ను విచిత్రంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి వై.స‌త్య‌కుమార్ ఖండించ‌డం గ‌మ‌నార్హం. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు గ‌త కొంత కాలంగా మౌనాన్ని ఆశ్ర‌యించారు. అంబులెన్స్‌ల‌ను అడ్డుకోవ‌డంపై ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి మాత్రం త‌ప్పు ప‌ట్టారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్‌పై యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స్పందించారు. రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విభృంభిస్తోందని, ఈ తరుణంలో ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం సమర్థనీయం కాద‌ని తెలిపారు. కొంతకాలం పాటైనా రాజకీయ దమన నీతిని కట్టిపెట్టాల‌ని ఆయ‌న విన్న‌వించారు. ప్ర‌స్తుత క‌రోనా విప‌త్కాలంలో అరెస్ట్‌ను త‌ప్పు ప‌ట్టిన ట్టుంది. అంతే త‌ప్ప‌, అరెస్ట్‌కు వ్య‌తిరేకం కాద‌నే భావ‌న ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లో క‌నిపిస్తోంది.

అప్ర‌జాస్వామిక విధానాల‌కు ఏ ప్ర‌భుత్వం పాల్ప‌డినా , పార్టీల‌కు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ఖండించాల్సిందే. ఇందులో రెండో మాట‌కే తావులేదు. మ‌రి కేసీఆర్ స‌ర్కార్ అప్ర‌జాస్వామికంగానే కాదు, అమాన‌వీయంగా అంబులెన్స్‌ల‌ను రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో అడ్డుకుంటుంటే, రోగులు ఆర్త‌నాదాలు చేస్తుంటే వీళ్లంతా మాట్లాడ‌కుండా ఎక్క‌డున్నారు? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. 

అంబులెన్స్‌ల‌ను అడ్డుకోవ‌డం మాన‌వ‌త్వం కాద‌ని తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా పౌర స‌మాజం గుర్తు చేస్తోంది. ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్‌పై స్పందించడానికి చూపిన ఉత్సాహంలో క‌నీసం ప‌దిశాత‌మైనా అంబులెన్స్ బాధితుల విష‌యంలో ఈ ప్ర‌తిప‌క్ష నేత‌లంతా క‌న‌బ‌రిచి ఉంటే ఏపీ ప్ర‌జానీకం ప్ర‌శంస‌లు పొందే వుండేవాళ్లు. 

కానీ అలా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇదంతా నేత‌ల మ‌ధ్య వ్య‌వ‌హారంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌రోనాతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం హైద‌రాబాద్‌కు వెళుతున్న రోగుల‌ను అడ్డుకుంటున్నా నోళ్లు తెర‌వ‌ని త‌మ నేత‌ల‌ను చూసి ఏపీ ప్ర‌జానీకం హ‌వ్వా…అని న‌వ్విపోతున్నారు.