గతంలో ఆస్ట్రేలియన్ జట్టు ఇదే తరహాలో రెండు విభిన్నమైన జట్లను రెండు వేర్వేరు చోట్ల మ్యాచ్ లను ఆడించింది. ఒక్క రోజు తేడాతో రెండు చోట్ల ఆస్ట్రేలియన్ జట్టు మ్యాచ్ ల ఆడింది. ఒక దేశంలో ఆస్ట్రేలియన్ టీ20 జట్టు అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడితే, మరో దేశ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియన్ టెస్టు జట్టు మరుసటి రోజే టెస్టు మ్యాచ్ ను ప్రారంభించింది.
పరిమిత ఓవర్ల మ్యాచ్ లకూ, టెస్టు మ్యాచ్ లకు వేర్వేరు ఆటగాళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి ఫీట్ సాధ్యమవుతుంది. సరిగ్గా ఇప్పుడు టీమిండియా కూడా అదే చేయబోతోంది. ఒక వైపు టీమిండియా ప్రధాన ఆటగాళ్లతో ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా, భారత జట్టు జెర్సీతోనే మరో జట్టు శ్రీలంకలో టీ20, వన్డే మ్యాచ్ లు ఆడబోతోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగానే ఈ విషయాన్ని ప్రకటించింది.
త్వరలోన టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలల సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ తో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తో సహా ఇంగ్లండ్ జాతీయ జట్టుతో ఐదు టెస్టులు, ఇతర మ్యాచ్ లు ఆడనుంది భారత జట్టు. అలాగే ఐపీఎల్ పెండింగ్ మ్యాచ్ లను కూడా ఇంగ్లండ్ లో ప్రేక్షకుల మధ్యన ఆడించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ సంగతేమో కానీ సుదీర్ఘంగా అయితే భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనుంది.
ఆ మ్యాచ్ ల విరామంలో ఇప్పుడు మరో జట్టు శ్రీలంక వెళ్లనుంది. అక్కడ టీ20లు, వన్డే మ్యాచ్ లను ఆడనుంది భారత జట్టు. ఈ జట్టుకు ధావన్ ప్రాతినిధ్యం వహించనున్నాడని సమాచారం. ప్రస్తుతం టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించడానికి అనేక మంది ఆటగాళ్లు వేచి చూపుల్లో ఉన్నారు.
కనీసం మూడు అంతర్జాతీయ జట్లకు రిజర్వ్ బెంచ్ తో కూడుకున్నంత మంది ఆటగాళ్లు ఇప్పుడు రేసులో ఉన్నారు. అంటే కనీసం 40 నుంచి 45 మంది అంతర్జాతీయ ప్రమాణాల్లో రాణించగల ఆటగాళ్లు అందుబాటులో ఉన్నట్టే. ఇంకా అంతర్జాతీయ ఆరంగేట్రం గురించి వేచి చూపుల్లో ఉన్న ఆటగాళ్లూ అనేక మంది ఉన్నారు. ఐపీఎల్ లో రాణించిన అనేక మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అవకాశాల కోసం వేచి చూపుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్ లకు తగిన ఆటగాళ్లను బీసీసీఐ ఇంగ్లండ్ కు పంపుతోంది. దాదాపు 20 మంది ప్లేయర్లు ఇంగ్లండ్ తో మ్యాచ్ లకు వెళ్లపోతున్నారు.
అయినప్పటికీ ఇంకా చోటు కోసం వేచి చూస్తున్న వాళ్లు ఉన్నారు. వారిలో ఇటీవలి ఐపీఎల్ మ్యాచ్ లలో బాగా రాణించిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. ఈ నేపథ్యంలో.. అలాంటి వారికి శ్రీలంక పర్యటనలో అవకాశం లభించడం ఖాయమైంది. ఓపెనర్ పృథ్వి షాతో సహా పలువురు ఐపీఎల్ స్టార్లు, జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే వంటి వాళ్లకు కూడా లంక పర్యటన సానుకూలంగా మారింది.
ప్రధాన ఆటగాళ్లలో చాలా మంది ఇంగ్లండ్ లో ఉండగా, మిగతా ఆటగాళ్లతో ఇండియా శ్రీలంకలో ఆడనుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టుకు ఇలా ద్వితీయ శ్రేణి అనుకున్న జట్టుతో ఆడటం కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. కొహ్లీ, బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా వంటి ప్రధాన ఆటగాళ్లు ఎవ్వరూ లేకుండానే అక్కడ కొన్ని మ్యాచ్ లలో భారత జట్టు ఆడింది.
నాలుగో టెస్టులో అయితే స్టార్లు లేకుండా సంచలన విజయం సాధించింది. అప్పుడే భారత జట్టు రిజర్వ్ బెంచ్ సత్తా బయటపడింది. ఎవరో ఒకరిద్దరి మీద ఆధారపడే పరిస్థితి లేదనే స్పష్టత అప్పుడే వచ్చింది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు లంక పర్యటనకు పూర్తి రిజర్వ్ బెంచ్ తో వెళ్తోంది భారత జట్టు. దీన్ని ఏ టీమ్, బీ టీమ్ అంటూ కొంతమంది ఎద్దేవాగా మాట్లాడవచ్చు కానీ, జాతీయ టీమ్ గానే ఈ ఆటగాళ్ల బృందం శ్రీలంక వెళ్లనుంది.
సాధారణంగా స్టార్ క్రికెటర్లు లేకుండా వచ్చే జట్లకు ఆతిథ్య దేశాలు సరిగా స్వాగతం పలకవు. టీవీ రేటింగులు పడిపోతాయి, అలాగే ద్వితీయ శ్రేణి జట్లను పంపడాన్ని అవమానంగా భావిస్తాయి. అయితే ఇప్పుడు బీసీసీఐ పవర్ ముందు లంక బోర్డు అలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు లేవు. బీసీసీఐ ఏ జట్టును పంపినా చాలనేపరిస్థితి ఉంటుంది. ఎలాగూ టీవీ రేటింగులకు లోటు ఉండదు కాబట్టి, లంక బోర్డుకూ ఈ విషయంలో అభ్యంతరాలు ఉండకపోవచ్చు.