ఏపీలో రైతులకు సరైన సమయంలో రైతు భరోసా మొత్తాలు అందాయి. వ్యవసాయదారులకు ఈ సమయం ఎంతో కీలకమైనది. ఇప్పటికే అక్కడక్కడ కాస్త వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మొదటి వారం నుంచినే వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా ఇది మూడో ఏడాది ప్రారంభ రైతు భరోసా నిధులు ఇవి. ప్రతియేటా మూడు దఫాలుగా జగన్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ ఉంది. ఏడాదికి పాసు పుస్తకానికి 13,500 రూపాయల చెప్పున జమ చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాదికి గానూ తొలి విడత రైతు భరోసా నిధుల చెల్లింపు జరిగింది. ఒక రైతు ఖాతాలో 7,500 రూపాయల మొత్తాన్ని జగన్ ప్రభుత్వం జమ చేసింది.
ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో రైతులకు ఈ నిధులు ఊరటగా మారాయి. ప్రతియేటా ఈ సమయంలో ఈ మాత్రం సాయం పెట్టుబడులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. ప్రత్యేకించి రెండు మూడు ఎకరాల సాగుభూమిని జీవనాధారంగా బతికే రైతులకు ఈ మొత్తాలు చాలా ఉపయుక్తం అవుతున్నాయి.
సాధారణంగా ఈ సమయంలో రైతులు రాయలసీమలో వేరుశనగ సాగుకు సన్నద్ధం అవుతూ ఉంటారు. విత్తనాల కొనుగోలుకు, సేద్యం ఖర్చులకూ డబ్బు అవసరమైన సమయం ఇది. మామూలుగా అయితే ఈ పెట్టుబడుల కోసం వారు అప్పులు ఇచ్చే వారిని, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడితో మొదలయ్యే వడ్డీ ల చెల్లింపు పంట మొత్తాన్నీ వడ్డీ వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వరకూ వెళ్లేది. దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితే ఉంది.
వడ్డీ వ్యాపారులు పెట్టుబడి మొత్తాలకు డబ్బులిస్తారు. ఆ తర్వాత వేరుశనగ పండితే వాళ్లే పట్టుకెళ్తారు. దీంతో ధర నిర్ణయం చాలా వరకూ వడ్డీ వ్యాపారులదే అయ్యేది. గత కొన్నేళ్లలో ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా, చిన్న రైతులు, తక్కువ కమతాల్లో వ్యవసాయం చేసే వారు.. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి బయటకు రాలేకపోయారు. అలాంటి వారికి ఇప్పుడు ఊరట దక్కుతోంది.
ప్రభుత్వమే పెట్టుబడి కోసం సాయం అందిస్తూ ఉంది. అందులోనూ చాలా మంది వ్యవసాయధారులు ఇంటికి ఒకటికి మించి పాసు పుస్తకాలను కలిగి ఉంటారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేరిట తలా కొంత భూమిని పెట్టుకుంటారు. దీంతో ఒక్కో ఇంటికి ప్లాన్ చేసుకున్నంత స్థాయిలో ఈ డబ్బులు అందుతుంటాయి.
ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు పేర్లతో పాసుపుస్తకాలను కలిగి, ఇలాంటి సాయాన్ని పొందే రైతు కుటుంబాలు కూడా ఎన్నో ఉంటాయి. అలాంటి వారికి రెట్టింపు లబ్ధి కలుగుతూ ఉంటుంది ఈ పథకంతో. ఈ సారి కూడా సీమలో వ్యవసాయం ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. మే నెలలోనే ఒకటీ రెండు పదున్లు అయ్యాయి చాలా చోట్ల. దీంతో మరోసారి రైతులు వ్యవసాయానికి రెడీ అవుతు ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఉపయోగడుతుంది. దీనికి తోడు.. సబ్సిడీ రేటుకు ప్రభుత్వమే విత్తన వేరుశనగను కూడా అందించనుంది. ఇలా ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రెండు రకాలుగానూ వ్యవసాయ బరువును మోయడంలో సాయంగా వస్తోంది.