నాకెందుకు భ‌య‌మంటే…

భయంగా ఉంది. Advertisement తెలీని భయమేదో వెంటాడుతూ ఉంది. మొన్న – నా సాహిత్యపు గురువు సింగమనేని నారాయణ… నిన్న – నన్ను సాహిత్యంలా వెన్నంటి ఉన్న బాల్యమిత్రుడు నారాయణరెడ్డి…. నేడు – నా…

భయంగా ఉంది.

తెలీని భయమేదో వెంటాడుతూ ఉంది.

మొన్న – నా సాహిత్యపు గురువు సింగమనేని నారాయణ…

నిన్న – నన్ను సాహిత్యంలా వెన్నంటి ఉన్న బాల్యమిత్రుడు నారాయణరెడ్డి….

నేడు – నా సాహిత్యపు మేనల్లుడు గజేంద్రనాథ్ …

కరోనాపులి పంజా దెబ్బకు గిలగిల్లాడి దాని కోరలకు చిక్కి ప్రాణాలు విడిచారు.

భయంగా ఉంది. ఆత్మీయులు దూరమయ్యే కొద్దీ భయం ముంచుకొస్తోంది.  

జీవితాంతం కరువు నేల దుఃఖాన్ని గురించే కథలు రాశాడు నా గురువు సింగమనేని. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకొంటోంటే వాళ్ల గుండెల్లో ధైర్యం నింపి, బతికే మనోస్థైర్యాన్ని ఇచ్చేందుకు ఊరూరా తిరిగి ప్రచారం చేసి, కరువు నేలను తడిపే కృష్ణాజలాల కోసం ఉద్యమాలు చేసిన ఉక్కుమనిషి, ఎక్కడ తాకినా మానవత్వం ఊటలూరే మహనీయుడు. ఆయన లేని లోటు నాకు తీరనిది. ఇప్పటికీ సాహిత్యపరంగా ఏదైనా సందేహం వస్తే ఆయనతో మాట్లాడాలని ఫోన్ తీసి ఆయన లేని విషయం గుర్తుకు వచ్చి గుండె బరువెక్కుతుంది.

నా గురువు, నా హితుడు, నా మార్గదర్శి, నా శ్రేయోభిలాషి, తప్పటడుగులు వేయబోతే వేలెత్తి హెచ్చరించే నా తండ్రి, మంచి కథ రాస్తే ఆలింగనం చేసుకుని ఆ కథను తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేసి ఆనందపడే నా తల్లి…. సింగమనేని నారాయణ గారిని కరోనా పొట్టన పెట్టుకుంది.

బాల్యం నుంచి నా పక్కన నడుస్తూ, యాభై ఏళ్ల సహవాసంలో ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ, నా పురోగతిని తన ఎదుగుదలగా భావిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ, ఎంత లావు సమస్యలు ఎదురైనా ఎడమకాలితో తన్నేస్తూ, వర్తమానంలో పరిపూర్ణంగా జీవిస్తూ, ఆధ్యాత్మికతను రోజువారీ జీవితానికి అన్వయిస్తూ, అజాతశత్రువుగా బతికిన నారాయణరెడ్డిని కరోనా కాటేసింది.

నన్ను “మామా!” అంటూ మనసారా పిలిచే గజేంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నా సాహిత్యాన్ని Facebookలో ప్రచారం చేయడాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్న వ్యక్తి, ఏరువాక సాహితీ పరిషత్ తరపున సింగమనేని నారాయణ సాహిత్య పురస్కారాన్ని ముగ్గురు కథా రచయితలకు అందించిన సాహిత్యాభిమాని, లక్కిరెడ్డి జయరామిరెడ్డి తో కలిసి సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న అక్షరప్రేమికుడు, ప్రతి ఉపాధ్యాయ శిక్షణా శిబిరంలో వినూత్న బోధనావనరులతో వచ్చి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసే గురువు, రాయలసీమ ప్రాంత ప్రజల గురించి 'హాన్స్ ఇండియా' పత్రికలో విశేషంగా ప్రచారం చేసిన సాహితీపిపాసి , మాండలిక పలుకుబళ్ళతో Facebookలో విస్తృతంగా కథనాలు రాసిన భాషాభిమాని మా గజేంద్రనాథ్ ను కరోనా ఒడిసిపట్టి తీసుకెళ్ళింది.

భయంగా ఉంది.

ఒక్కో ఆకు రాల్చుకుని  మోడుచెట్టులా మిగిలిపోతున్నాను. శివ రాచర్ల, వివేక్, కళాసాగర్లు కరోనా పంజాదెబ్బ తిన్నప్పటికీ దాని కోరలకు దొరక్కుండా తప్పించుకున్నారు. అది కొంత ఊరట.         

అయినా భయంగా ఉంది.

ఈ భయం నిరుటి కరోనా రుతువులో లేదు. అప్పుడు ఆర్థికమైన ఇబ్బందులతో దేశమంతా అల్లకల్లోలంగా మారిన భయం ఉండేదిగానీ ఇట్లా నా పక్కపక్కన నడిచే మిత్రులు నాకు తెలియకుండానే అదృశ్యం కావటం జరగలేదు. అడవి దారుల నడిచి వస్తోంటే మాటేసిన పులి ముందుమనిషికి తెలియకుండానే వెనక వారిని  ఒక్కొక్కరిని మెడ కరచుకొని పోయినట్లు కరోనా నా చుట్టుపక్కల వాళ్ళని లాక్కుపోతోంది. ఒక్కో ఆకును తుంచి పడేసి నన్ను మోడు చెట్టును చేస్తోంది. ఒంటరిని చేస్తూ వుంది. ఒంటరితనాన్ని భరించే స్థితిలో నేను లేను.

పల్లెల నుంచి యువతరమంతా నగరాలకు వలస పోయింది. తిరిగి పల్లెలకు వచ్చి ఇక్కడి ముసలాళ్ళనూ, బీడునేలల్నీ రక్షించమని, పల్లెను సుసంపన్నం చేయమనీ రచయితగా చాలా కథల్లో వేడుకొన్నాను. మొన్న మొన్నటి దాకా నగరానికి వెళ్లిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. సంపాదించిన సొమ్ముతో పల్లెను బతికించలేదు.

కానీ ఇప్పుడు నగరాన్నించి పల్లెలకు యువకులు తిరిగి వస్తున్నారు. భార్యాపిల్లల్ని అక్కడే వదిలేసి వస్తున్నారు. సంపదతో రావలసిన వాళ్లు కాస్తా కరోనా మహమ్మారిని వెంటబెట్టుకొని వస్తున్నారు. నగరాల్లోనే ఉంటే భార్యాపిల్లలకు అంటుకుంటుందని పల్లెల్లోని ముసలి తల్లిదండ్రుల వద్దకు వస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నా, చీడ పట్టినా కొడుకు కొడుకే కాబట్టి తల్లిదండ్రులు వాళ్లను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటున్నారు. నగరాల నుంచి వచ్చిన వాళ్ళవల్ల ప్రస్తుతం పల్లెల వీధులు కరోనా వైరస్ తో నిండిపోతున్నాయి.

రాయలసీమలో సగానికి సగం మంది మహా నగరాలకు వలస వెళ్లి బతుకుతున్న వారే. బతుకుదెరువు చూపించిన నగరాలు ఇప్పుడు మృత్యుస్పర్శను రుచి జూపిస్తున్నాయి. కరువును చూసి భయపడి నగరానికి వెళ్లిన వాళ్లు అక్కడ కరోనాను చూసి భయపడి పల్లెలకు పారిపోయి వస్తున్నారు

భయంగా ఉంది.

ఈ రోజో రేపో అది నాకు ఎదురు కావటమో, లేదా దానికి నేను ఎదురు పడటమో జరగొచ్చు … ఏదోక మూల… ఏదోక జనారణ్యంలో … ఇద్దరం ఎదురెదురు ఢీకొనవచ్చు. రక్తం రుచి మరిగిన పులి లాంటిది అది. నన్నులక్ష్యపెట్టదు. ధైర్యం కోల్పోతానేమోనని భయంగా ఉంది.

ఎందరికో ధైర్యం చెప్పిన గజేంద్ర లాంటి వాడే ధైర్యం కోల్పోయాడు. నీళ్లలో పడ్డవాడికి తెలుస్తుంది ప్రవాహం నుంచి బయటపడటం ఎంత కష్టమో. గట్టునున్నవాళ్లు ఎన్ని ఉపాయాలయినా చెప్పొచ్చు – 'ఆచెయ్యి అట్లా యీకాలు ఇట్లా కదుల్చు అదే ఈత అవుతుంది' అని. సులభంగా సూచనలివ్వొచ్చు. ఊపిరాడని పరిస్థితుల్లో కాలుచేయి కదల్చటం ఎంత కష్టమో నీళ్ళల్లో పడ్డవాడికే తెలుస్తుంది.

కరోనా మనిషి ప్రాణాల్ని తను స్వయంగా తీయటం లేదు. మనిషి ధైర్యాన్ని తినేస్తోంది. ఆత్మస్థైర్యాన్ని పిల్చేస్తోంది. ఒంటరి తనపు భావనను నరనరానా ఎక్కిస్తోంది. ఆసుపత్రిని స్మశాన వాటికలా మార్చి చూపిస్తోంది. మనిషిని తనంతకు తాను మృత్యు ముఖంలోకి అడుగేసేలా చేస్తోంది. Facebookలు, WhatsAppలు, Instagramలు,  TVలు, వార్తా పత్రికలు గాలి దుమారాలై కళ్ళనిండా దుమ్ము కొట్టి వాస్తవాల్ని ఆలోచించకుండా చేస్తున్నాయి.

భయంగా ఉంది.

మనిషి భయపడి పోవడం పట్ల భయంగా ఉంది.

పిరికివాడిగా మారిపోవడం పట్ల భయంగా ఉంది.

తాడును పాముగా భ్రమించి ప్రాణాలు పోగొట్టుకునేలా కథనాలు అల్లటంపట్ల భయంగా ఉంది.

నలుగురు ఏడవడం కాదు గాని ఆ నలుగురూ శవం వెంట వచ్చేందుకు కూడా భయపడిపోయి, శవాన్ని ఊర్లోకి రానివ్వకుండా, స్మశానానికి తరలించనీకుండా, పాడె మోయకుండా జనాలు వెర్రిగా భయపడి పోవడం పట్ల భయంగా ఉంది.

మానవ పరిణామం  ఇంత ఉన్నతంగా ఎదగడానికి కారణం మనిషి ధైర్యంతోబాటు అతని ఆత్మస్థైర్యంతో కూడిన ఆలోచనా విధానమే. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా జాతి యావత్తు భయానికి గురి కావడం పట్ల భయంగా ఉంది.

మిత్రులారా నిజంగానే భయమేస్తోంది.

స‌న్న‌పురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి, ప్ర‌ముఖ ర‌చ‌యిత‌