ఉత్తరాంధ్రాకు ఊపిరి

ఆక్సిజన్ లేక కరోనా రోగులు ప్రాణాలు విడిచేస్తున్న ఘటనలు దేశంలో ఎక్కడో అక్కడ ప్రతీ రోజూ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో కరోనా రోగులకు ఊపిరి పోయడానికి ప్రగతి భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో రాజ్యసభ…

ఆక్సిజన్ లేక కరోనా రోగులు ప్రాణాలు విడిచేస్తున్న ఘటనలు దేశంలో ఎక్కడో అక్కడ ప్రతీ రోజూ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో కరోనా రోగులకు ఊపిరి పోయడానికి ప్రగతి భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో ఆక్సిజన్ తో కూడిన 300 పడకలను ఏర్పాటు చేశారు.

ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఆక్సిజన్ అందకుండా ఏ కరోనా రోగీ చనిపోకూడదని ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని మంత్రి చెప్పడం విశేషం. 

ప్రతీ జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంటను ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు.  ఇక ప్రతీ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఎంత ఉంది, ఎంత కావాలి అన్నది ముందే చూసుకుని కలెక్టర్ కి తెలియచేస్తే లోటు లేకుండా ఎప్పటికపుడు సమకూర్చే పటిష్టమైన యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

మరో వైపు చూస్తే ప్రగతి భారతి ట్రస్ట్ ఆద్వర్యంలో మరిన్ని కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కూడా విజయసాయిరెడ్డి రెడీ అవుతున్నారు. 

దీని వల్ల ఒక్క విశాఖకే కాదు, ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల ప్రజానీకానికి ఊపిరి అందుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే మరికొన్ని స్వచ్చంద సంస్థలు కూడా ప్రభుత్వానికి బాసటగా నిలిస్తే కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కోగలమని  అంటున్నారు.