కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో విబేధించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన యువతరం నేతల జాబితాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత జ్యోతిరాదిత్య సింధియా నిలుస్తూ ఉన్నారు. జగన్ స్థాయి సాహసం కాదు సింధియాది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సోనియాగాంధీ సూపర్ పవర్ లో ఉన్నప్పుడు జగన్ ఆమెతో విబేధించి బయటకు వచ్చారు. సొంతంగా పార్టీ పెట్టుకుని పెద్దసాహసం చేశారు. అనేక పోరాటాలతో జగన్ అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ ను ఏపీ వరకూ తుడిచి పెట్టారు.
సింధియాది వేరే కథ. కాంగ్రెస్ పార్టీ అపసోపాలు పడుతున్న సమయంలో ఆ పార్టీ హై కమాండ్ తో విబేధించి బయటకు వస్తున్నారీయన. అది కూడా సొంత పార్టీ సీన్ కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసమే సాగిలా పడిపోతున్నాడు. బీజేపీ ఇస్తున్న ఆఫర్లతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే జగన్, సింధియాల మధ్య వేరే పోలికలున్నాయి. జగన్ తండ్రి వైఎస్ఆర్ హార్డ్ కోర్ కాంగ్రెస్ నేత, జ్యోతిరాదిత్య తండ్రి కూడా అంతే. జనసంఘ్ తో మాధవ్ రావ్ సింధియా ప్రస్థానం ప్రారంభం అయినా కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. రాజీవ్ గాంధీ అంటే వైఎస్ కు, ఇటు మాధవ్ రావ్ సింధియాకు మంచి గౌరవమర్యాదలు ఉండేవి. రాజీవ్ తరం నేతలుగా నిలిచారు. ఒక ప్రైవేట్ విమాన ప్రమాదంలో మరణించారు. ఎనిమిది మందితో వెళ్తున్న విమానం కూలిపోవడంతో మాధవ్ రావ్ సింధియా మరణించారు. సీఎం హోదాలో ఉండగా వైఎస్ అదేరీతిన హెలీకాప్టర్ ప్రమాదంలో దూరం అయ్యారు.
జ్యోతిరాదిత్య సింధియా 18 యేళ్లుగా కాంగ్రెస్ లోనే కష్టపడ్డాడు. అయితే తను అనుకున్నది దక్కించుకోలేకపోయారు. దీంతో ఇప్పటికి బయటకు వస్తున్నట్టుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు శక్తి ఉంటే సింధియా రాజీపడేవారేమో! జగన్ మాత్రం కాంగ్రెస్ సూపర్ పవర్ గా ఉండగానే ధిక్కరించి సత్తా చూపించారు. ఇక సింధియా ఏ మేరకు సత్తా చూపిస్తారో!