తెలుగు నాట కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ పెను సంచలనం. ఆవిర్భావంతోనే కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించి అధికారాన్ని సంపాదించుకుంది టీడీపీ. ఆ తర్వాత ఆ పార్టీ అనేక కుదుపులకు లోను అయ్యింది. పలు సార్లు ఓడింది, మరి కొన్ని సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో శూన్య స్థితికి చేరింది. మిగిలింది ఏపీలో మాత్రమే.
ఇలాంటి క్రమంలో.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో లోతును చవిచూస్తూ ఉండటం గమనార్హం. టీడీపీ చరిత్రలోనే ఎదుర్కొనని ఒక పతనావస్థ ఇప్పుడు ఎదుర్కొంటూ ఉంది. అది టీడీపీ తరఫున రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి లేకపోవడం! తెలంగాణలో ఎప్పుడో పార్టీ కథ అయిపోయింది. ఈ సారి తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు ఒక్క నామినేషన్ ను దాఖలు చేసే పరిస్థితి కూడా లేకపోవడం గమనార్హం! బహుశా టీడీపీ చరిత్రలో ఇది తొలిసారిలా ఉంది.
2004 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అయితే అప్పట్లో ఉమ్మడి ఏపీ కోటాలో తెలుగుదేశం కనీసం ఒక్క రాజ్యసభ సీటును అయినా పొందగలిగేది! టీడీపీ అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంవీ మైసూరారెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయగలిగింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయినా… ప్రతిపక్షంగా తగినన్ని సీట్లను పొందింది. దీంతో ఆ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు తనకు కావాల్సిన వాళ్లను రాజ్యసభకు నామినేట్ చేశారు. వాళ్లే సీఎం రమేశ్, సుజనా చౌదరి వంటి వాళ్లు!
2014లో అధికారంలోకి వచ్చాకా.. చంద్రబాబు నాయుడు అనేక మందిని రాజ్యసభకు పంపగలిగారు. అయితే అలాంటి వాళ్లు కూడా టీడీపీ ఓడిపోయాకా బీజేపీ వైపుకు చేరిపోయారు. ఇక ఇప్పుడు.. టీడీపీ కనీసం ఒక్కరంటే ఒక్కరిని కూడా రాజ్యసభకు నామినేట్ చేయలేకపోతూ ఉంది! ఇదీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎదుర్కొంటున్న అత్యంత పతనావస్థ అని చెప్పవచ్చు. ఇక రాజ్యసభలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్కరూ లేదా ఎవరూ లేరు అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా నామినేషన్లు లేకపోవడంతో.. టీడీపీ రాజ్యసభలో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోతూ ఉంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారువుతోంది అనే అభిప్రాయానికి ఈ పరిణామాలు మరింత సాక్ష్యంగా నిలుస్తున్నాయి.