ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైంది. పెళ్లి నాటి ప్రతి కదలిక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంటుంది. ఇందులో చిన్నాపెద్దా, పేద, ధనిక అనే తేడాలుండవు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లకు జ్ఞాపకాలు ఉంటాయి. ప్రముఖ నటి ఖుష్బూ పెళ్లిరోజు మార్చి 9. ఈ సందర్భంగా ఖుష్బూ తన పెళ్లినాటి ఖుషీ ఖుషీ సంగతులను అభిమానులతో పంచుకున్నారు.
నటి ఖుష్బూ, దర్శకుడు సి.సుందర్ దంపతులకు నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన భర్త సుందర్‌కు ఖుష్బూ స్వీట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఖుష్బూ ఓ గమ్మత్తైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లిరోజు పెండ్లి కుమారుడైన సుందర్ కల్యాణ మండపానికి ముహూర్త సమయం కంటే ఆలస్యంగా వచ్చాడనే విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ అద్భుతమైన ట్వీట్ చేశారు.
“మన పెళ్లై 20 ఏళ్లు గడిచింది. అయినా ఏం మారలేదు. ఇప్పటికీ నేను నీ పక్కన కూచొని అట్లే మాట్లాడుతున్నా. నువ్వు ఎప్పట్లా నవ్వుతూ వింటున్నావు. తన పెళ్లికి తనే ఆలస్యంగా వచ్చిన పెళ్లి కుమారుడివి నువ్వు (నవ్వుతూ). కష్టసుఖాల్లో, మంచిచెడుల్లో, జయాపజయాల్లో ఒకరితో ఒకరు ఉన్నాం. ప్రేమతో ఓ ఇంటిని, కుటుంబాన్ని నిర్మించుకున్నాం. నువ్వు, నేను ఎప్పటికీ ఒక్కటే. నా ధైర్యానికి, బలానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు” అని ఖుష్బూ స్వీట్ ట్వీట్ చేశారు.
ఖుష్బూ, సుందర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నటి రాధికా , కస్తూరి తదితరులు ఉన్నారు. మీది ఎప్పటికీ ముచ్చటైన, ఆదర్శ జంట అని వారు శుభాకాంక్షలు చెప్పారు.