కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి ఎంతో మంది ఆత్మీయుల్ని, స్నేహితుల్ని తీసుకెళుతోంది. ఎంతో మందికి ఆవేదనను మిగిల్చుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉసురు తీసేందుకు మహమ్మారి పొంచుకుని ఉంది. ఈ నేపథ్యంలో సినీరంగానికి చెందిన ఎంతో మంది కరోనా బారిన పడి కోలుకోగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఒక్కటే మనముందున్న ప్రత్యామ్నాయ మార్గం. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజానీకాన్ని అప్రమత్తం చేస్తూ ట్విటర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. చిరు ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘మన ఆత్మీయులలో కొందరినీ ఈ వైరస్ వల్ల కోల్పోతున్నామంటే.. గుండె తరుక్కుపోతోంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటి నుంచి బయటికి రాకండి.
ఒకవేళ లాక్‌డౌన్ సడలించిన వేళల్లో బయటికి వచ్చినా..మాస్కులు ధరించండి. వీలైతే డబుల్ మాస్కులు ధరించండి. లాక్‌డౌన్‌లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌కు రిజిస్టర్ చేయించుకుని.. ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా.. దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కొవిడ్ పాజిటివ్ అయినా.. దయచేసి భయపడకండి.
వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఐసోలేట్ చేసుకుని వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడండి. కరోనా నుంచి కోలుకున్న నెలరోజుల తర్వాత మీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే.. కరోనా నుంచి కనీసం ఇద్దరిని మీరు కాపాడినవా రవుతారు.
దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండి. ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి చెప్పి.. మీ వంతు సాయం చేయండి ప్లీజ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ.. మన కుటుంబాన్ని, మన ఊరుని తద్వారా మన దేశాన్ని రక్షించుకుందాం. ప్లీజ్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి.. సురక్షితంగా ఉండండి’ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.
ఒకటిన్నర నిమిషం పాటు ఈ వీడియో ఉంది. చిరంజీవి చాలా భావోద్వేగంతో తన ఆవేదనను పంచుకున్నారు. ఆయన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించేలా ఉన్నాయి.