విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.
వేపాడ మండలం నల్లబెల్లిలో ఉంటున్న సత్యనారాయణ గుప్తా కుటుంబానికి ఊరిలో మంచి పేరు ఉంది. ఈయన వయసు 62 సంవత్సరాలు. భార్య సత్యవతికి 57 ఏళ్లు. వీళ్లు కొన్నాళ్లుగా విశాఖ జిల్లా చోడవరంలో ఉంటున్నారు. 4 రోజుల కిందట వీళ్లకు కరోనా సోకింది.
పాజిటివ్ అని తెలిసిన వెంటనే స్వగ్రామానికి వచ్చేశారు దంపతులు. వీళ్లతో పాటు వైరస్ బారిన పడిన కొడుకు, కోడలు కూడా వచ్చారు. అంతా కలిసి తమ ఇంటికి దగ్గర్లో ఉన్న నేల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం అలుకుముంది.
కరోనా సోకడంతో ఊర్లో ప్రజలెవ్వరూ పట్టించుకోకపోవడంతో అవమానభారంతో వీళ్లంతా ఆత్మహత్య చేసుకొని ఉంటారని ప్రాధమికంగా భావిస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.