Advertisement

Advertisement


Home > Movies - Reviews

'సినిమా బండి' రివ్యూ

'సినిమా బండి' రివ్యూ

చిత్రం: సినిమా బండి
తారాగణం: సందీప్ వారణాసి, వికాస్ వశిష్ట, రాగ్ మయూర్, సింధు, సిరివెన్నెల యనమందల తదితరులు
కెమెరా: అపూర్వ సాలిగ్రాం, సాగర్
ఎడిటింగ్: ధర్మేంద్ర, రవితేజ
నిర్మాతలు: రాజ్ నిడుమోరు, కృష్ణ డికె
కథ- దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
విడుదల: 14 మే 2021
స్ట్రీమింగ్: నెట్ ఫ్లిక్స్

థియేటర్లో కొత్త సినిమా లేక ఓటీటీలో విడుదలైన ప్రతి సినిమా మీద దృష్టి పెట్టాల్సొస్తోంది...ఏదైనా ఆణిముత్యం దొరుకుతుందేమోనని. కానీ మళయాళ సినిమాతో పోలిస్తే ఈ విషయంలో తెలుగు కథకులు ఎంత వెనకబడి ఉన్నారో తెలిసి మనమీద మనకే జాలేస్తుంది.

అసలు ఒక సినిమా ఎందుకు తీస్తున్నాం? ఏం చెబుదామని తీస్తున్నాం? ఎలా తీస్తున్నాం? అనే ప్రశ్నలు వేసుకునే తీస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు.  

రాయలసీమలో ఒక పల్లెటూరు. ఆ ఊరిలో ఒక ఆటో డ్రైవర్. తన ఆటోలో ఎవరో ఒక ఖరీదైన సోనీ కెమెరాని మర్చిపోయి దిగిపోతారు. అదెవరిదో ఇతనికి వెలగదు. ఇంట్లో పెట్టుకుంటాడు దానిని.

అదే ఊళ్లో ఏవో చిన్న చిన్న పెళ్లి ఫోటోలు తీసుకునే ఒక ఫ్రెండ్ ఉంటాడు మన ఆటో డ్రైవర్ కి. అతనిని పిలిచి ఈ కెమెరా చూపించి అమ్మితే ఎంతొస్తుందని అడుగుతాడు. అమ్మడం కంటే అద్దెకివ్వడం బెటర్ అనుకుంటారు. ఫైనల్గా రెండూ కాదు..ఆ కెమెరాతో ఒక సినిమా తీసేస్తే కోట్లు సంపాదించచ్చు కదా అని డిసైడైపోతారు.

సినిమాలో హీరోగా నటించేందుకు ఊళ్లో బార్బర్ షాపు నడుపుకునే ఒకతనిని ఒప్పిస్తారు. ముందు ఒక స్కూల్లో చదువుకునే అమ్మాయిని, తర్వాత మార్కెట్లో కూరలమ్ముకునే మరొకామెని హీరోయిన్ చేస్తారు. ఇంతకీ వాళ్లు చివరికి అనుకున్నది సాధిస్తారా అనేది ఓపికుంటే చూసి తెలుసుకోవచ్చు.

టీవీలు, మొబైల్ ఫోన్లు విరివిగా వాడే ఒక ఊరిలో, ఫోటొ స్టూడియోలు వగైరాలు ఉన్న ఒక ఏరియాలో కెమెరాని జనం ఒక వింత వస్తువుగా చూడడం ఆశ్చర్యమేస్తుంది. పైగా దానితో సినిమా తీసి కోట్లు సంపాదించాలని ఒకడికి ఆలోచన పుడితే ఖండించడానికి ఊళ్ళో ఒక్కడూ ఉండడు. ఊరు ఊరంతా అంత అమాయకత్వమా? నేటి రోజుల్లో రాజకీయాల మీద, సినిమాల మీద విలేజర్స్ కి చాలా అవగాహన ఉంటోంది. ఆ నేపథ్యం తెలిసిన ఆడియన్స్ కి ఈ సినిమా అత్యంత కృతకంగా ఉంటుంది.

ఇదే కథని చిన్నపిల్లలమీద తీసుంటే కొంతైనా కన్విన్సింగ్ గా ఉండేదేమో.  

రియలిస్టిక్ సినిమా అంటే యాంబియన్స్ ఒకటి సెట్ అయితే సరిపోదు. కథ, కథనం, ముగింపులో మలుపు కూడా హత్తుకునేలా ఉండాలి. అవేవీ లేని సినిమా ఈ సినిమాబండి. చివర్లో "ప్రతివాడిలోనూ ఫిల్మ్ మేకర్ ఉంటాడు" అనే లైన్ చూసాక తప్ప ఈ సినిమా తీయడం వెనుక ఉద్దేశ్యమేమిటో అర్థమవడం కష్టం. ఆ లైన్ ఏదో ముందే వేసుంటే బాగుండేదేమో. టైటిల్ కూడా చివర్లో వేసినట్టు "తాత రాసిన టైటానిక్" అని పెట్టుంటే బాగుండేది క్యాచీగా.

సినిమా క్లైమాక్సులోనైనా ఏదో ట్విస్టుంటుందేమోనని చూస్తే ఏమీ లేదు. బరువుగా ఉండాల్సిన చోట పూర్తిగా తేలిపోయింది. ఇంతకీ ఒక సినిమా తీసి చూసుకున్నాక కథలో పాత్రలకి ఒరిగిందేమిటనేది బోధపడదు.

ఆటోడ్రైవర్ గా చేసిన వికాస్ వశిష్ట, బార్బర్ గా నటించిన రాగ్ మయూర్ ల స్క్రీన్ ప్రెజెన్స్, నటన బాగుంది. మిగతా వారి గురించి, శాఖల గురించి చెప్పుకోవడానికేం లేదు.

ఈ సినిమా బండిలో ప్రయాణం ఎడ్లబండిలో ప్రయాణంలా ఉంటుంది. అదే ఇష్టమనుకునేవాళ్లు ట్రై చేయొచ్చు. కష్టమనుకునేవాళ్లు ఆ సమయాన్ని మరో పనికి వాడుకోవచ్చు.

బాటం లైన్: ఎడ్లబండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?