కేసీఆర్ స‌ర్కార్‌ను క‌డిగి పారేసిన హైకోర్టు

కేసీఆర్ స‌ర్కార్‌ను తెలంగాణ హైకోర్టు క‌డిగి పారేసింది. ఏపీ -తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఏపీ అంబులెన్స్‌ల‌ను అడ్డుకోవ‌డంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. అంబులెన్స్‌లను నిలువ‌రించే హ‌క్కు  తెలంగాణ సర్కార్‌కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి…

కేసీఆర్ స‌ర్కార్‌ను తెలంగాణ హైకోర్టు క‌డిగి పారేసింది. ఏపీ -తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఏపీ అంబులెన్స్‌ల‌ను అడ్డుకోవ‌డంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. అంబులెన్స్‌లను నిలువ‌రించే హ‌క్కు  తెలంగాణ సర్కార్‌కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి సర్క్యులర్ ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్ట్ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ విశ్రాంత ఐఆర్ఎస్‌ అధికారి వెంకట క్రిష్ణారావు దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.  దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ నాలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు వస్తున్నారని తెలిపారు. 

ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోగుల తాకిడి పెరిగింద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ముందస్తు అనుమతి ఉన్నవారికి చికిత్స నిరాకరించడం లేదని కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఆస్పత్రిలో పడకలు ఉంటేనే ఇతర రాష్ట్రాల రోగులు తెలంగాణకు రావాలని ఇంతకు ముందే చెప్పామ‌న్నారు. 

ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయ‌ని కోర్టుకు తెలిపారు. దీనిపై ధ‌ర్మాస‌నం స్పందిస్తూ …. అంబులెన్స్‌లను ఏ రాష్ట్రం ఆపలేదని పేర్కొంది. కారణం ఏదైనా అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఇది రాజ్యాంగం, చట్టాలు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా? అని తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

అన్ని రాష్ట్రాల ప్రజలకు జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ధ‌ర్మాస‌నం గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. జాతీయ రహదారులపై రాకపోకలు నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. ఇలా చేస్తే జాతీయ రహదారుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది.

సరిహద్దుల్లోనే రోగులు చనిపోతున్నార‌ని కోర్టు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. రోగులు చనిపోతుంటే మీరు సర్క్యులర్లు జారీ చేస్తారా? సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ జనరల్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌లో ప్రజలకు సైతం అడ్మిషన్ ఉండట్లేదని ధ‌ర్మాస‌నం తూర్పార‌ప‌ట్టింది. హైదరాబాద్‌లో రోగుల‌కు ఆక్సిజన్ అవసరమైతే.. చిన్న ఆస్పత్రుల నుంచి పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం లేదా? అని హైకోర్టు ప్ర‌శ్నించింది. రాజ్యాంగాన్ని మీరు మార్చలేరని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

ఇతర రాష్ట్రాల ప్రజలను అడ్డుకోవడం రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘనే అవుతుందని ఏపీ ఏజీ శ్రీరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ గ‌ట్టిగా వాదించారు. 

ఇరువైపు వాద‌న‌లు విన్న తెలంగాణ హైకోర్టు … రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని, అంబులెన్స్‌లను అడ్డుకునేందుకు మరో రూపంలో ప్రయత్నించవద్దని హెచ్చ‌రించింది.

రెండు వారాల్లోపు కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై స‌రిహ‌ద్దుల్లో అంబులెన్స్‌ల‌ను తెలంగాణ పోలీసులు అడ్డుకోర‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది.