భర్తతో విడాకులు తీసుకున్న తన వల్ల కుటుంబ పరువు పోతుందని ఇంట్లో నుంచి గెంటేశారని ప్రముఖ నటి వనిత వాపోయారు. సినీ తారలు మంజులా, విజయ్‌కుమార్ దంపతుల వారసురాలిగా చిత్ర పరిశ్రమలో వనిత అడుగు పెట్టారు. ‘దేవి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చివరికి అన్నిటిని ఎదుర్కొని చిత్రపరిశ్రమలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ గట్టిగా నిలిచారు.
గత ఏడాది మూడో పెళ్లితో ఒక్కసారిగా వార్తల్లో ఎక్కారు. చిత్ర పరిశ్రమ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని దీటుగా తిప్పికొట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకు ప్రధాన కారణం కుటుంబమే అని ఆరోపించారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో వనిత వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన అంశాలు వైరల్ అయ్యాయి. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారంటే…
‘ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం ఎవరికీ సరదా కాదు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలుసు. నా పెళ్లిళ్లు పెటాకులు కావడానికి నా తల్లిదండ్రులు కూడా ఓ కారణం. జీవితం అంటే ఏమిటో తెలియని 18 ఏళ్ల వయసులో నాకు పెళ్లి చేశారు. నా భర్తతో ఎన్నోసార్లు గొడవలు. మానసిక కుంగిపోయాను. చివరికి చేసేదేమీ లేక విడాకులు తీసుకున్నాను. నేను విడాకులు తీసుకోవడం నా తల్లిదండ్రులకు నచ్చలేదు. నా వల్ల వాళ్ల పరువు పోతుందని భావించి నన్ను ఇంట్లో నుంచి గంటేశారు’ అని వనిత చెప్పుకొచ్చారు.
‘నా ముగ్గురు పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేశాను. ఎలాంటి సపోర్టు లేకపోవడంతో నడిరోడ్డులో నిలిచినట్టైంది. ఒక తోడు ఉంటే బాగుంటుందని ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాను. ఏమాటకామాట చెప్పాలి. తను నన్ను బాగా చూసుకున్నాడు. చిన్న చిన్న గొడవలైనప్పటికీ మా జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయే క్రమంలో మళ్లీ నాన్న ఎంటర్ అయ్యాడు. పిల్లల పెంపకం గురించి కేసు పెట్టడం వల్ల నా భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక మూడో వివాహం గురించి చెప్పడానికి ఏమీ లేదు’ అని వనిత తన ఆవేదనంతా వెల్లడించారు.
తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లు, తమ్ముడు కూడా తనను దూరం పెట్టారని వాపోయారు. సోషల్‌మీడియాల్లో తనను కుటుంబ సభ్యులు బ్లాక్ చేశారని తెలిపారామె. దేవుడి దయ వల్లే తాను ఈ స్థాయికి రాగలిగినట్టు చెప్పారు.
జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వల్లే ఎన్నో విషయాలు తెలుసుకోగలిగినట్టు వనిత చెప్పారు. సినిమాల కంటే వ్యక్తిగత జీవితమే వనితను హైలెట్‌గా నిలిపింది. ఇటీవల సినిమాల్లో కూడా ఆమె బిజీగా ఉంటున్నారు.