రివ్యూ: బ్లఫ్ మాస్టర్
రేటింగ్: 2.25/5
బ్యానర్: అభిషేక్ ఫిలింస్
తారాగణం: సత్యదేవ్, నందిత శ్వేత, సిజ్జు, పృధ్వీ, టెంపర్ వంశీ తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాతలు: రమేష్ పిళ్ళై
దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి
విడుదల తేదీ: డిసెంబర్ 28, 2018
తమిళ హిట్ 'సతురంగ వేట్టయ్'కి రీమేక్ అయిన 'బ్లఫ్ మాస్టర్'తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా మారాడు. జనాన్ని మోసం చేసి జీవనం సాగించే ఒక మోసగాడి కథ ఇది. దర్శకుడు గోపి గణేష్ పట్టాభి ఒరిజినల్ స్టోరీకి కట్టుబడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే సిక్స్-ఎపిసోడ్స్ స్ట్రక్చర్ స్క్రీన్‌ప్లే వున్న ఒరిజినల్ స్టయిల్‌ని పక్కకి పెట్టి స్ట్రెయిట్ నెరేషన్‌తోనే 'బ్లఫ్ మాస్టర్' తీసాడు. ఆ ఎపిసోడ్ల వారీ స్ట్రక్చర్ వల్ల కథ ఒక అంకం నుంచి మరో అంకానికి జంప్ చేస్తోన్న భావన కలగదు. స్ట్రెయిట్ నెరేషన్‌లో హీరో క్యారెక్టర్‌లో మార్పు ఈజీగా వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఎపిసోడ్స్ స్టయిల్ నెరేషన్ వల్ల కొత్త అనుభూతి కలుగుతుంది. మరెందుకని ఆ పద్ధతి వద్దనుకున్నారనేది దర్శకుడికే తెలియాలి.
ఇక కథ విషయానికి వస్తే… ఉత్తమ్ (సత్యదేవ్) తన తెలివితేటలతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ 'బ్లఫ్ మాస్టర్'గా జీవనం సాగిస్తుంటాడు. అయితే ఆ జీవితం వద్దని మోసాలు మానేసి మంచిగా వుండాలని చూస్తే అతని గతం వెంటాడుతుంది. మళ్లీ ఒక మహా దగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కథాపరంగా ఫ్రెష్‌నెస్ ఏమీ లేదు కానీ మోసాలని ఆకట్టుకునేలా చూపించే వీలుంది. కానీ ఇందులో మోసాలన్నీ కన్వీనియంట్‌గా జరిగిపోతుంటాయి. మోసం చేస్తోన్న వాడిలో తెలివి కంటే మోసానికి గురవుతోన్న వాడిలో అమాయకత్వమే హైలైట్ అవడం వల్ల సదరు సన్నివేశాల్లో చాలా వరకు తేలిపోయాయి.
కనీసం కథనంలో అయినా ఆసక్తికరమైన ట్విస్టులున్నాయా అంటే అదీ లేదు. ఫ్లాట్ నెరేషన్‌తో మొదలైన కాసేపటికి బాగా విసిగించేలా తయారవుతుంది. కథలో కీలకమైన హీరోలోని పరివర్తనకి కారణమైన హీరోయిన్ ట్రాక్ మరీ డ్రమెటిక్‌గా వుంది. అతనెందుకు మారిపోతాడో, ఆమె ఎందుకని అతడికి మనసిస్తుందో అనే వాటికి బలమైన కారణాలు కనిపించవు. కనీసం మోసాల పరంగా అయినా తమిళ చిత్రాన్ని వదిలేసి కాస్త ఒరిజినల్‌గా ఆలోచించాల్సింది.
నిత్యం వార్తల్లో మోసగాళ్ల లీలలు తెలుస్తూనే వుంటాయి కనుక కాంటెంపరరీ విషయాలని చూపించాల్సింది. లేదా కాన్ థ్రిల్లర్స్ హాలీవుడ్‌లో కోకొల్లలు. ఇందులో చూపించిన అవుట్ డేటెడ్ ట్రిక్స్ కంటే భలే మోసం చేసాడనిపించేలా సన్నివేశాలని రాసుకుని వుండాల్సింది. సత్యదేవ్ టాలెంటెడ్ యాక్టర్ అయినా కానీ ఈ పాత్రకి ఎందుకో అతను సూట్ అయినట్టు అనిపించలేదు. అతనికి వున్న రెగ్యులర్ ఇమేజ్ ఈ పాత్రకి నప్పలేదు. నందిత శ్వేత మామూలుగా మంచి నటి.
కానీ ఈ చిత్రంలో ఎందుకో అవసరానికి మించిన హావభావాలతో మెప్పించడానికి చాలా అతిగా ప్రయత్నించింది. ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ తమ పాత్రలకి న్యాయం చేసారు. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన చిత్రం కనుక సాంకేతికంగా చెప్పుకోతగ్గ విశేషాలేమీ లేవు. అంతా స్టాండర్డ్ స్టఫ్. సంభాషణలు మాత్రం బాగున్నాయి. చాలా వరకు తమిళ డైలాగులని తర్జుమా చేసినప్పటికీ మంచి సంభాషణలు కుదిరాయి. దర్శకుడు ఒరిజినల్‌కి కట్టుబడి బేసిక్స్ పాటించాడు. ఈ తరహా కథల్ని ఇంప్రొవైజ్ చేసుకోవడానికి వున్న స్కోప్‌ని వాడుకుని వుంటే బ్లఫ్స్ ఆసక్తికరంగా వుండేవి.
ప్రథమార్ధం సాఫీగా సాగిపోయినా కానీ ద్వితీయార్ధం మాత్రం బాగా విసిగిస్తుంది. కనీసం ఫైనల్ ఎపిసోడ్స్ అయినా థ్రిల్లింగ్‌గా వుంటే ఎంతో కొంత ఉపశమనం దక్కేది కానీ త్వరగా ముగించేస్తే బావుండనిపిస్తుందే తప్ప ఏ దశలోను ఆసక్తి రేకెత్తించలేకపోయింది. మార్కెటింగ్ బాగానే చేసారు కానీ బాక్సాఫీస్‌ని గెలవడానికి ఈ కంటెంట్ సరిపోదనిపించింది.
బాటమ్ లైన్: బోరింగ్ బ్లఫ్స్!