ప్రభాస్ హీరోగా, దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో హైలెట్స్ చెప్పమంటే ఎవరికైనా అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే గుర్తొస్తాయి. నిజానికి మేకర్స్ కూడా వాటినే ప్రధానంగా చూపిస్తున్నారు. అయితే అంతకంటే హైలెట్ ఎలిమెంట్ ఒకటి సాహోలో ఉంది. అదే ఓ భారీ చోరీ సీన్.
ఓ నగల షాపు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేస్తాడు హీరో. అది ఎంత పెర్ ఫెక్ట్ గా ఉంటుందంటే చోరీలో ఎక్కడా హీరో ప్రమేయం ఉండదు. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తుల్ని సెలక్ట్ చేసుకుంటాడు. నేరుగా నగలు వచ్చి తన కారులో పడేటట్టు చేసుకుంటాడు. చెప్పుకుంటే ఇది జులాయి సినిమాలో చోరీ సీన్ కు దగ్గరగా అనిపిస్తున్నప్పటికీ, దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా హైటెక్ రేంజ్ లో ఉంటుంది.
ధూమ్ సిరీస్ లో చోరీ సన్నివేశాలు ఎలా ఉంటాయో, సాహోలో ఈ రాబరీ ఎపిసోడ్ అంతకుమించి అన్నట్టు తెరకెక్కింది. సినిమాలో హీరో ఎంట్రన్స్ కు ముందు వచ్చే ఈ సీన్ హైలెట్ గా నిలుస్తుంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన షాపింగ్ మాల్, మార్కెట్ సెట్స్ లో ఈ టోటల్ ఎపిసోడ్ ను తీశారు.
మరోవైపు సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ ను యూరప్ లో షూట్ చేయాల్సి ఉన్నప్పటికీ మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. యూరోప్ బ్యాక్ డ్రాప్ తో రామోజీ ఫిలింసిటీలోనే సెట్స్ నిర్మిస్తున్నారు. అక్కడే షూటింగ్ పూర్తిచేయబోతున్నారు. ఆగస్ట్ 15న సాహో సినిమాను విడుదల చేయబోతున్నారు.