తన సినిమాలు ఏవీ ఇప్పట్లో విడుదలకు ప్లాన్ చేయవద్దని మెగాస్టార్ చిరంజీవి తన నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేసారా? ఆగస్టులో విడుదలవుతుంది అనుకున్న మెగాస్టార్ సినిమా సెప్టెంబర్ కు వాయిదా పడిపోయిందా? టాలీవుడ్ లో ఇదే వినిపిస్తోంది.
మెగాస్టార్ నటించిన లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా దాదాపు రెడీ అయ్యింది. భోళాశంకర్ సినిమా చాలా వరకు పూర్తయింది. ఆగస్టు రెండో వారంలో గాడ్ ఫాదర్ సినిమాను విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి.
కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం అలాంటి ఆలోచనలు అన్నీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమా పెద్ద హిట్ అయింది. కంటెంట్ పరంగా లోటు పాట్లు వున్నా, ముతక కామెడీ అయినా, పాటలు బాగుండి, మెగాస్టార్ ను చాన్నాళ్ల తరువాత తెరపై చూడాలన్న కోరిక అన్నీ కలిసి పెద్ద హిట్ చేసాయి.
కానీ ఆ తరువాత చేసిన సైరా సినిమా మెగాస్టార్ కు నిర్మాతగా దారుణమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాంతో సినిమా నిర్మాణాన్నే పక్కన పెట్టేసారు. 152వ సినిమా ఆచార్య పరమ డిజాస్టర్ అయింది.
జనం సరైన ఓపెనింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు మెగాస్టార్ ఆలోచనలో పడ్డారు. అన్నీ సద్దు మణికి, జనం ఆచార్య ను మరచి, మళ్లీ తన సినిమా కోసం కాస్త ఆతృతగా వేచి చూసే వరకు విడుదలలు పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే లూసిఫర్ సినిమాను వెనక్కు నెట్టినట్లు బోగట్టా.
ఆగస్టు రెండో వారంలో నితిన్..మాచర్ల నియోజకవర్గం, బెల్లంకొండ రెండో కొడుకు గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమాలు ఇప్పటికే డేట్ లు అనౌన్స్ చేసాయి. మరి ఒకటి రెండు సినిమాలు కూడా వచ్చే అవకాశం వుందని వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే మెగాస్టార్ సినిమా ఇప్పట్లో లేనట్లే అనుకోవాల్సిందే.