వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఓ రేంజ్‌లో హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాలన్ని రఘురామ అసలు ఊహించలేదు. అందుకే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేయడం. తన పిటిషన్‌ను ప్రజావ్యాజ్యం కాదని తేల్చి చెప్పడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మద్యం ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ మనీ పేరుతో ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించడం, ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపి రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ ఎవరంటూ ధర్మాసనం సంబంధిత న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్ ఎంపీ రఘురామకృష్ణరాజు అని కోర్టుకు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవద్దంటారా? అంటూ కోర్టు ప్రశ్నించింది. పేదలు, సామాన్యులకు రాజ్యాంగం అర్థం కాదని, వారికి కావాల్సింది సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం మాత్రమేనని ధర్మాసనం తెలిపింది. ఈ విషయమై ప్రభుత్వాన్ని కనీసం వివరణ కూడా అడిగేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎందుకంటే ఇదో నిరర్థక వ్యాజ్యం అని ధర్మాసనం తేల్చి చెప్పడం గమనార్హం. పిటిషన్‌లో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదని స్పషం చేసింది. ఈ వ్యాజ్యంలో తాము ఉత్తర్వులు జారీ చేస్తామని, అవరసరమనుకుంటే సుప్రీంకోర్టుకెళ్లొచ్చని పిటిషనర్‌కి ధర్మాసనం సూచించడం గమనార్హం.
ఈ వ్యాజ్యంపై విచారణలో భాగంగా హైకోర్టు సీరియస్ ఆగ్రహంతో కూడిన కామెంట్స్ చేసింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టుందని సంచలన కామెంట్ చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు అనిపిస్తోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని, హైకోర్టు జడ్జీలమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల విధులేంటో రాజ్యాంగం పేర్కొందని, దాని ప్రకారమే నడుచుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను నడపడం, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదని పేర్కొంది. అసలు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరు? అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.
ఆర్థిక సంస్థలు సంతృప్తి చెందితేనే రుణం ఇస్తాయని, లేకుంటే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు ఆర్థిక సంస్థలకు లేని ఇబ్బంది మీకెందుకు? అని కోర్టు నిలదీసింది. రుణం అనేది ఇది పూర్తిగా అప్పు ఇచ్చే, తీసుకునే వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన అంతర్గత వ్యవహారంగా హైకోర్టు అభిప్రాయపడింది. మూడో వ్యక్తి జోక్యానికి ఆస్కారం ఎక్కడుంది? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరు దాఖలు చేస్తారో మీకు తెలుసు కదా? అణగారిన వర్గాలు, కోర్టుకు రాలేని స్థితిలో ఉన్న వ్యక్తులు పిల్ వేయాలని, మరి మీరెందుకు ఈ వ్యాజ్యం వేశారు? అని హైకోర్టు ఘాటు కామెంట్స్ చేయడం విశేషం. హైకోర్టు ఉత్తర్వులపై రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన పిటిషన్‌లో ప్రజాప్రయోజనం ఏముందని హైకోర్టు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆన్నారు. ముఖ్యమంత్రి తన భవిష్యత్ మాత్రమే చూసుకున్నారని, తాను మాత్రం ప్రజల భవిష్యత్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు చెప్పారు. హైకోర్టులో ఊహించినట్టే జరిగిందని రఘురామ చెప్పడం గమనార్హం. సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు.