టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆరోగ్యంపై భయపడుతున్నదెవరు? తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీమహానాడులో స్వయంగా చంద్రబాబే తన ఆరోగ్యం గురించి ప్రస్తావించడంతో చర్చ తెరపైకి వచ్చింది. తన ఆరోగ్యంపై ఇటీల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కామెంట్స్ చేసినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై చంద్రబాబు స్పందించారు. బాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“నా ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలూ లేవు. ఉదయం ఆరు గంటలకు ఎంత కూల్‌గా వుంటానో, రాత్రి 10 గంటలకూ అంతే కూల్‌గా ఉంటాను. అలిపిరిలో 24 క్లెమోర్‌మైన్స్ దాడి జరిగినప్పుడే ఎందుకో నా అవసరం ఉందని దేవుడు రక్షించాడు. అధికారంలోకి వస్తాం. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారికి తగిన శాస్తి చేస్తాం” అని చంద్రబాబు హెచ్చరించారు.
ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఇక మనకు తిరుగే లేదని గడపగడపకూ మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో జగన్ అన్నట్టు వార్తలొచ్చాయి. ఎందుకంటే 2029 నాటికి చంద్రబాబు వయసు 80 దాటుతుందని, ఇక ఆయన చేయగలిగేదీ ఏమీ లేదని అన్నట్టు ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. అలాగే రామోజీ కూడా జీవిత చరమాంకంలో ఉన్నారని, ఇలా ప్రత్యర్థులంతా వృద్ధాప్యంతో మరుగున పడిపోతారని జగన్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
జగన్ అన్నారో లేదో తెలియదు కానీ, అందులో వాస్తవం లేకపోలేదు. ఇప్పుడు చంద్రబాబు వయసు 73 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగి అయితే దశాబ్దం క్రితమే రిటైర్ అయ్యి వుండేవారు. రాజకీయ నేత కావడంతో అలాంటివేవీ వర్తించలేదు. నిజానికి చంద్రబాబు ఆరోగ్యంపై ఎక్కువ భయపడుతున్నది టీడీపీ నేతలే. అందుకే జనంలోకి తరచూ వెళ్లొద్దని సన్నిహితులు ఆయనకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. కరోనా సమయంలో ఇంటి గడప చంద్రబాబు దాటని విషయాన్ని ఎలా మరిచిపోగలం? ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోడాన్ని ఎవరూ తప్పు పట్టరు.
ముఖ్యంగా 2024 నాటికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, అధికారంలోకి వస్తే ఎలాగోలా పార్టీని బతికించుకో వచ్చనే తపన టీడీపీ శ్రేయోభిలాషుల్లో కనిపిస్తోంది. మరోవైపు బాబు తర్వాత పార్టీని నడిపించే నాయకుడెవరనే ప్రశ్నకు జవాబు దొరకని దయనీయ స్థితి. చంద్రబాబు కుమారుడిగా లోకేశ్‌ను వారసుడిగా భావిస్తున్నప్పటికీ, ఆయనలో నాయకత్వ లక్షణాలు లేకపోవడం టీడీపీకి మైనస్‌గా మారింది. లోకేశ్ నాయకత్వాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే బాబు తర్వాత టీడీపీ భవిష్యత్? ఏంటనే ప్రశ్నకు… ఇక కనుమరుగు కావాల్సిందేనా? అని ఆ పార్టీ శ్రేణులు ఆవేదనతో జవాబు చెప్పుకుంటున్న పరిస్థితి.
జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ అసమర్థతో కాంగ్రెస్ అదృశ్యమవుతున్నట్టుగానే, ఏపీలో లోకేశ్ చేతకానితనంతో టీడీపీకి అదే గతి పడుతుందనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును చూసి లోకేశ్‌ను గౌరవిస్తున్నారే తప్ప, ఆయన నాయకత్వ సమర్థతకు మెచ్చి కాదనే అభిప్రాయాలు టీడీపీలో ఉన్నాయి. టీడీపీ వెలుగు చంద్రబాబు జీవించి ఉన్నంత వరకే అని ఆ పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు పుట్టిన వాడు గిట్టక తప్పదు. ఇది వాస్తవం. ఇందుకు చంద్రబాబైనా, జగన్‌బాబైనా అతీతులు కాదు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మాత్రం అద్భుతంగా సాగింది. ఎన్టీఆర్ లాంటి దిగ్గజ నటుడు, రాజకీయవేత్తను ఒక్క దెబ్బతో కూలదోయడం అంటే మామూలు విషయం కాదు. బాబు వెన్నుపోటుపై విమర్శలు సరేసరి. కానీ నిన్నమొన్నటి వరకూ బాబు రాజకీయ వ్యూహాలను తట్టుకోవడం ఆషామాషీ కాదు.
ఒక్క జగన్ మాత్రమే చంద్రబాబుని చావుదెబ్బ తీశారు. ఇంత కాలం తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ఎలాంటి ఎత్తులు వేస్తారో అని ప్రత్యర్థులు ఆందోళన చెందేవారు. ఇప్పుడు జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నుతారో అనే పరిస్థితి. కాలానుగుణంగా రాజకీయాల్లో మార్పులొచ్చాయి, వస్తాయి. జగన్ లాంటి యువ నాయకుడి ఎత్తుగడలను అర్థం చేసుకోవడం చంద్రబాబుకు సాధ్యం కావడం లేదు.
జగన్‌ను రాజకీయంగా ఓడించాలంటే, జగన్ తప్పులే తప్ప, ప్రత్యర్థులు కాదనే విషయాన్ని గ్రహించాలి. అందుకే టీడీపీ భవిష్యత్‌పై ఆ పార్టీ శ్రేణుల్లో బెంగ. చంద్రబాబు ఆరోగ్యంపై జగన్ కంటే సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే ఎక్కువ ఆందోళన ఉందనేది వాస్తవం. ముందు తన వాళ్లలో గూడుకట్టుకున్న భయాన్ని బాబు తొలగించాల్సి వుంది.
సొదుం రమణ