ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్య ప్రథమ పౌరుడి ఎన్నిక ఆసక్తిని రేపుతూ ఉంది. రబ్బర్ స్టాంపు అనే ఉపమానాన్ని వాడుతున్నప్పటికీ.. భారతదేశ పాలన అంతా రాష్ట్రపతి పేరు మీదునే సాగుతుంది.
రాష్ట్రపతి ఎన్నికను కూడా రాజకీయ లెక్కల ప్రకారం చేపట్టే రాజకీయ పార్టీలున్న జాతి మనది. తమకు దూరం అనుకునే వర్గాల వారికి రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేస్తూ ఎంతో కొంత ప్రయోజనం పొందాలనే లెక్కలు వేస్తుంటాయి పార్టీలు!
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రపతి పదవి కి మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ లెక్కలు ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలో ఈ సారి ఎస్టీలకు అవకాశం దక్కవచ్చు.
ఇక బలాబలాల లెక్కల్లో కమలం పార్టీ కొంతవరకే సేఫ్. అన్ని లెక్కలను కలిపి చూస్తే బీజేపీకి 48 శాతం ఓట్లున్నాయి. ఎనన్డీయే రూపంలో బీజేపీకి ఉన్న బలం ఇది! అంటే.. బీజేపీకి అనుకూలంగా 48 శాతం ఓట్లు ఉంటే, మిగతా ఓట్లు కనీసం యాభై రెండు శాతం ఉన్నాయి.
సూటిగా చెప్పాలంటే.. ఎన్డీయేతర పార్టీలన్నీ చేతులు కలిపితే రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించే అభ్యర్థిని ఓడించడం చాలా సులువు! అయితే ఆ పార్టీలన్నీ చేతులు కలపడం మాత్రం జరిగే పని కాదు. 48 శాతం ఓట్లను కలిగిన బీజేపీ.. ఎన్డీయేతర, యూపీయేతరగా ఉన్న పార్టీలను కలుపుకుంటే.. పని పూర్తవుతుంది. అయితే కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని చలాయిస్తున్న బీజేపీ ఈ విషయంలో కాస్త కష్టపడాల్సి ఉంది. మరీ తమ అభ్యర్థి స్వల్ప ఓట్ల బలంతో కాకుండా.. మెరుగైన మెజారిటీని కూడా సాధించాల్సిన అవసరం ఆ పార్టీకి ప్రతిష్ట లాంటిది!
ఇక తాము యూపీయేలోనే ఉన్నట్టుగా చెప్పుకుంటున్న పార్టీల ఓట్ల బలం 23శాతం. వీటికి తోడు.. టీఎంసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్ఎస్, బీజేడీ, ఎస్పీ.. వంటి పార్టీలన్నీ కలిస్తే.. అప్పుడు ప్రతిపక్ష సమస్త పార్టీ ల బలం యాభై రెండు శాతం అవుతుంది. ఇది జరిగే పని కాదు కాబట్టి.. బీజేపీ సేఫ్.