బుల్డోజర్, ఇది అభివృద్ధికి, విధ్వంసానికి సంకేతం. మంచిగా వాడుకుంటే ఇంటి నిర్మాణం సులువు, చెడ్డగా వాడితే ఇల్లు నేలమట్టం. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నది ఇదే. ఒక వర్గం వాళ్ల ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వమే వాడుతూ వుంది. ఈ చట్ట వ్యతిరేకత, దమనకాండని సుప్రీంకోర్టు తనంతట తాను పరిగణలోకి తీసుకోవాలని 12 మంది న్యాయకోవిదులు చీఫ్ జస్టిస్‌కి లేఖ రాశారు. వాళ్లలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రు (జై భీమ్ ఫేమ్), బి.సుదర్శన్‌రెడ్డి, న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్, ఆయన కుమారుడు ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నారు.
కరోనా టైంలో లక్షలాది మంది కాలి నడకన నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు తనంతట తాను జోక్యం చేసుకున్నట్టుగానే, ఈ కేసుని కూడా తీసుకోవాలని వారు కోరుతున్నారు.
నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. అది లేకపోతే నియంతృత్వం. అయితే యూపీలో కొంత కాలంగా నిరసనకి నాయకత్వం వహించిన వాళ్ల ఇళ్లని కూలుస్తున్నారు. అవి అక్రమ నిర్మాణాలని చెబుతున్నారు. అక్రమం అయితే ఇంత కాలంగా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు? హఠాత్తుగా ఇప్పుడే అక్రమాలని గుర్తొచ్చాయా?
నిరసనలో అల్లర్లు జరిగితే శిక్షించడానికి చట్టాలు, కోర్టులున్నాయి. ప్రభుత్వం నేరుగా శిక్షించడం అంటే, కోర్టుల పనిని కూడా తానే చేసినట్టు. యోగి ప్రారంభించిన బుల్డోజర్ శిక్షలు అందరూ అమలు చేస్తే దేశంలో కనబడని నియంతృత్వం వచ్చినట్టే.
ఈ ప్రమాదాన్ని వివరించాలని న్యాయ నిపుణులు కోరుతున్నారు. ఒక వర్గం వారిపై కక్షతో వ్యవహరించడం సమాజంలో ద్వేషాలకు కారణమవుతుందని వాళ్లు లేఖలో చెప్పారు.
ఒక ఇల్లు అంటే ఎంతో మందికి నీడ. దాంట్లో నిరసనకారుడు మాత్రమే వుండడు. ఒక కుటుంబం వుంటుంది. చిన్నపిల్లలు వుంటారు. వాళ్లందర్నీ రోడ్డు మీద పడేయడం ఏ రకమైన న్యాయం?