ఎన్నికలకు ఇంకా రెండేళ్లే టైమ్ ఉంది. ఓవైపు చంద్రబాబు, దత్తపుత్రుడు.. వారి అనుకూల మీడియా వైసీపీని, జగన్ ని ఎలాగైనా టార్గెట్ చేయాలని చూస్తోంది. అసత్యాలు, అబద్ధాలు, అర్థ సత్యాలతో వార్తలు వండివారుస్తోంది. ఈ దశలో ఆ బ్యాచ్ ని ఎదుర్కోవాలంటే ఇటువైపు అస్త్ర శస్త్రాలు సిద్ధంగా ఉండాలి.
ఇటీవల టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. దీనికి పోటీగా వైసీపీ నుంచి బస్సు యాత్ర చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ ఏ విధంగా మేలు చేశారనే విషయాన్ని వివరించడానికి ఈ యాత్ర చేపట్టారు నాయకులు. దాదాపుగా మహానాడుకి పోటీగా సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరిగింది. అది అక్కడితో పూర్తయింది.
ఇప్పుడు చంద్రబాబు యాత్ర మొదలైంది, ఆల్రెడీ చంద్రబాబు వైసీపీపై విమర్శల దాడి మొదలుపెట్టారు. మరి దీన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ ఏవైనా ప్రయత్నాలు ప్రారంభించిందా..? వైసీపీకి ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా..? ఇప్పటి వరకూ బాబు యాత్రను వైసీపీ వాళ్లు పెద్ద సీరియస్ గా పట్టించుకున్నట్టు లేరు.
ఓవైపు ఆత్మకూరు ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్ వారికి ఉంది, ఇంకోవైపు ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ గడప గడపకి మన ప్రభుత్వం అనే టాస్క్ ఇచ్చారు. సో.. వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.
మరి చంద్రబాబుకి కౌంటర్లు ఇచ్చేది ఎవరు..? బాబు కోసం ఓ టీమ్ రంగంలోకి దిగకపోతే.. ఈరోజు నుంచి ఆయన చెప్పే అసత్యాలే జనం నోళ్లలో నానే అవకాశాలున్నాయి.
జగనే రంగంలోకి దిగాలా..?
అప్పుడెప్పుడో టెన్త్ క్లాస్ ఫలితాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తే.. నిన్న జగన్ కౌంటర్ ఇచ్చారు. కోనసీమ అల్లర్లలో ఇళ్లు తగలబెట్టడం జరిగి మూడు వారాలవుతోంది. నిన్న ఆ అల్లర్ల విషయంలో జగన్ కౌంటర్ ఇచ్చారు.
ఈలోపంతా ప్రతిపక్షాలు చెప్పిందే నిజమని జనం నమ్మాలా..? ఇప్పుడు చంద్రబాబు యాత్రకి కూడా ఏరోజుకారోజు కౌంటర్లు ఇవ్వకపోతే పచ్చ మీడియా ఎలా రెచ్చిపోతుందో అందరికీ తెలుసు.
అందుకే బాబు యాత్రని టార్గెట్ చేస్తూ జగన్ నేరుగా రంగంలోకి దిగాల్సిందే. కనీసం మంత్రులైనా చంద్రబాబు దుష్ప్రచారానికి వ్యతిరేకంగా కొత్త ఎపిసోడ్ మొదలు పెట్టాలి. పేరేదయినా పర్లేదు, బాబు చెప్పే అబద్ధాలను జనాలకి వివరించాలి. అప్పుడే చంద్రబాబుకి యాత్రా ఫలం దక్కకుండా చేసినవాళ్లవుతారు.