సినిమాల విషయంలో కమల్ చేసే ప్రయోగాల గురించి కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. సినిమాను అత్యంత ప్రేమించే కమల్, తన పాత్రల విషయంలో లెక్కకు మిక్కిలి ప్రయోగాలు చేశారు. ఈ తరంలో అనేక మంది హీరోలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పటికీ.. వీరందరి కన్నా ముందే కమల్ ఒక బాట వేశాడు. అదంతా తెలిసిన చరిత్రే.
ఆ సంగతలా ఉంటే.. సినిమా ద్వారా కమల్ హాసన్ ఆర్థికంగా వేల కోట్లకు పడగలెత్తింది కూడా ఏమీ లేదనేది సూటిగా స్పష్టం అయ్యే విషయం. సౌతిండియాలో దశాబ్దాల నుంచి స్టార్ డమ్ ఉంది. హిందీలో మార్కెట్ ఉంది. పదుల కోట్ల రూపాయల భారీ పారితోషికాలతో కమల్ వందల కోట్ల రూపాయలను కూడ బెట్టినట్టుగా అయితే అగుపించదు వ్యవహారం.
దీనికి అనేక కారణాలున్నాయి. రజనీకాంత్, చిరంజీవి వంటి స్టార్ ల తరహాలో కమల్ ఎంతసేపూ మాస్ మసాలాల రూట్లోనే వెళ్లలేదు. కమల్ దారి ప్రత్యేకంగా నిలిచింది. కమర్షియల్ ఎంటర్ టైనర్లు చేశాడు కానీ, మాస్ ఇమేజ్ కే కట్టుబడాలనే లెక్కలు వేసుకోలేదు. మాస్ సినిమాల స్టార్లకే ఎక్కువ పారితోషికాలు అందడం ఇండస్ట్రీలో ఉన్న కట్టుబడి. దీంతో కమల్ ఆర్థికంగా సంపాదించుకోవడంలో వెనుకబడి ఉండవచ్చు.
కామెడీలు, ప్రయోగాలు చేసే వాళ్లకు భారీ రెమ్యూనిరేషన్లు ముట్టే అవకాశాలు అంతంతమాత్రమే. దీనికి తోడు కమల్ సొంతంగా నిర్మాతగా కూడా ప్రయోగాలకు పూనుకున్నారు తన కెరీర్ లో. ఇలాంటివి కొన్ని ఆయనకు ఆర్థికంగా నష్టాలను కూడా మిగిల్చిన సందర్భాలున్నాయి.
80లలో కమల్ సొంత నిర్మాణంలో రూపొందించిన *అమావాస్య చంద్రుడు* సినిమా భారీ నష్టాలను మిగిల్చిందట. ఎంతలా అంటే.. ఆ సినిమా నష్టాలను పూడ్చుకోవడానికి నటుడిగా కమల్ ఏడెనిమిదేళ్లు కష్టపడాల్సి వచ్చిందంటే ఆశ్చర్యం కలగకమానదు. చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ అమావాస్య చంద్రుడు మిగిల్చిన నష్టాలను పూడ్చుకోవడానికి కమల్ కు చాలా సమయమే పట్టిందట.
అలాగని కమల్ ప్రయోగాలు అక్కడితో కూడా ఆగలేదు. *పోతురాజు* వంటి అత్యంత భిన్నమైన ప్రయోగాత్మక సినిమాను కమల్ సొంత బ్యానర్లోనే తీశాడు. తన ప్రయోగాల ఆసక్తికి వేరే నిర్మాతలను బలి పెట్టే తరహాలో కాకుండా.. కమల్ సొంత డబ్బుతోనే వాటికి ఖర్చు పెడుతూ వచ్చాడు. తన సోదరుల పేర్లను నిర్మాతలుగా పెడుతూ తను వెనకుండి నడిపించాడు కమల్.
ఈ క్రమంలో 'విశ్వరూపం' విడుదల సమయంలో నెలకొన్న వివాదంతో కమల్ ఆర్థిక పరిస్థితి మరింత చితికి పోయిందని వార్తలు వచ్చాయి. తమిళనాడుకు నాటి సీఎం జయలలిత కు కమల్ పై పుట్టిన కసి ఫలితంగా విశ్వరూపం విడుదల కష్టసాధ్యంగా మారింది. ఆ సమయంలో కమల్ కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడానికి రజనీకాంత్ వంటి వారు కూడా ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని కమల్ హాసనే చెప్పారు కూడా. తన డేట్స్ ఇస్తానంటూ, ఉచితంగా ఒక సినిమా చేసి పెడతానంటూ కమల్ కు ప్రతిపాదించారట రజనీకాంత్. కృతజ్ఞతలు చెప్పి ఊరుకున్నాడట కమల్.
ఈ క్రమంలో కమల్ తాజా సినిమా విక్రమ్ భారీ హిట్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో కమల్ ప్రాఫిట్స్ ఏవో కానీ.. ఇప్పుడొస్తున్న డబ్బుతో తన అప్పులు తీరిపోతాయంటూ కమల్ చెబుతున్నారు. ఇన్నాళ్లూ తన దగ్గర డబ్బు లేక ఎవ్వరికీ ఇవ్వలేకపోయినట్టుగా, ఇప్పుడు అప్పులను తీర్చబోతున్నట్టుగా కమల్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.