పురందేశ్వరిని తరిమి కొడితే తప్ప, బీజేపీని రక్షించుకోలేమని ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే విమర్శ వుంది. ఇది కేవలం విమర్శ కాదు, వాస్తవం అని తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఆవేదనతో అందరికీ అర్థమైంది. ఇది కేవలం సుబ్బారెడ్డి ఒక్కటి ఆక్రోశం, ఆవేదన మాత్రమే కాదని, పార్టీలోని నిజమైన బీజేపీ నాయకులు, కార్యకర్తలందరిదీ అనే చర్చకు తెరలేచింది.
బీజేపీ అధ్యక్షురాలిగా తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, మిగిలిన సామాజిక వర్గాల నేతలకు అప్రాధాన్య పదవులు కట్టబెట్టడం వెనుక బీజేపీని బలహీనపరిచే కుట్ర వుందని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు అదే విషయాన్ని విజయవాడ ప్రెస్‌క్లబ్ వేదికగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్బారెడ్డి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పి పురందేశ్వరికి గట్టి షాక్ ఇచ్చారు.
పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా వుంటూ, తన మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని గళమెత్తిన సుబ్బారెడ్డి బీజేపీలో సాధారణ నాయకుడు కాదు. బీజేపీలో అత్యంత నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు. 37 ఏళ్లుగా అతను ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, అలాగే బీజేపీలలో వివిధ స్థాయిల్లో క్రియాశీలకంగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. బీజేపీలో సుశుక్షితుడైన కార్యకర్తగా, నాయకుడిగా ఆయన్ను పార్టీ శ్రేణులు గౌరవిస్తాయి. అందుకే పురందేశ్వరిపై ఆయన విమర్శలకు అంత గౌరవం దక్కింది.
పురందేశ్వరి హఠావో…బీజేపీ బచావో అనే నినాదంతో సుబ్బారెడ్డి తాను ఆరాధించే పార్టీని రక్షించుకునేందుకు పురందేశ్వరిపై యుద్ధాన్ని ప్రకటించారు. పురందేశ్వరిపై సుబ్బారెడ్డి విమర్శలను బీజేపీ నిజమైన నాయకులెవరూ ఖండించకపోవడం విశేషం. పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం అంతా స్వార్థ రాజకీయాలతో ముడిపడి వుందని ఆయన ఘాటు విమర్శ చేశారు. బీజేపీలో పురందేశ్వరి, ఆయన భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ గతంలో వైసీపీలో కొనసాగడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇది రాజకీయ అవకాశ వాదం కాదా? అని ఆయన నిలదీశారు.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేస్తే, టీడీపీ నేతల కంటే మీరెందుకు ఖండించారని ఆయన నిలదీశారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుని, కనీసం ఒక్క ఎంపీ సీటు అయినా దక్కించుకుని, అందులో గెలిచి కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకోవాలని పురందేశ్వరి ఎత్తుగడ వేశారని విమర్శించారు. అలాగే ఏపీలో మద్యం కుంభకోణంపై ఆరోపణల వెనుక పురందేశ్వరి ఆర్థిక ప్రయోజనాలున్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇసుక స్కామ్‌పై ఆరోపణలు గుప్పించి, ఆ తర్వాత ముడుపులు తీసుకుని మౌనం పాటించిందని నిజం కాదా? అని సుబ్బారెడ్డి నిలదీశారు.
ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి మీరు తప్పుకుంటేనే పార్టీకి మోక్షమని,లేదంటే పార్టీని కాపాడుకోడానికి తాము నడుం బిగించాల్సి వస్తుందని పురందేశ్వరికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. పురందేశ్వరి కులపిచ్చి, మద్యం, ఇసుక వ్యవహారాల్లో స్కామ్ జరుగుతోందని పురందేశ్వరి ఆరోపణలు… కేవలం కొన్ని సంస్థలను బెదిరించి ఆర్థికంగా లబ్ధి పొందడానికే అని సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆరోపించడం వెనుక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు ప్రతిబింబిస్తున్నాయనే చర్చకు తెరలేచింది.
పురందేశ్వరిపై సుబ్బారెడ్డి ఆరోపణలను కేవలం ఆయన ఒక్కడివిగా చూడొద్దని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే పురందేశ్వరి కుట్రపూరిత వ్యవహారశైలిపై సొంత పార్టీ అధిష్టానం పెద్దల దృష్టికి బీజేపీ నేతలు తీసుకెళ్లారు. అయితే ఆమెను తప్పించడానికి సమయం తీసుకుంటుండడంతో ఇక ఆలస్యమైతే అసలుకే ఎసరు వస్తుందనే భయంతో బీజేపీని ఆరాధించే నాయకులు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా నోరు విప్పుతున్నారు. తమను పార్టీ నుంచి గెంటేయించుకోడానికి కూడా సుబ్బారెడ్డి లాంటి నాయకులు సిద్ధమయ్యారు. అంతిమంగా బీజేపీని రక్షించుకోవాలనేది బీజేపీ నిఖార్సైన నాయకుల అభిప్రాయం.
బీజేపీ ఎదుగుదలకు అతిపెద్ద అవరోధంగా మారిన పురందేశ్వరిని పార్టీ నుంచి వెళ్లగొట్టేంత వరకూ ఆ పార్టీ నాయకులు విశ్రమించేది లేదంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీ బీజేపీలోని మరిన్ని గళాలు పురందేశ్వరి వ్యవహారంపై మాట్లాడనున్నాయి.