గ్రూప్-1 ఇంటర్వ్యూలకు సంబంధించి ఏపీపీఎస్సీకి హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. ఇంటర్య్వూలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకూ యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 మెయిన్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి చేపట్టనున్న ఇంటర్వ్యూలను నిలుపుదల చేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణ చేపట్టారు. మంగళవారం సుదీర్ఘ విచారణ జరిపారు. ఇరు పక్షాల వాదనలు విన్నారు. చివరికి ప్రభుత్వ వాదన వైపే ఆయన మొగ్గారు.
ఏపీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఇంటర్వ్యూకు అర్హత సాధించలేక ఏదో జరిగిందని ఆరోపించడం తగదన్నారు. పేపర్లు దిద్దిన 162 మందిలో 112 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 50 మంది సీనియర్ లెక్చరర్లు ఉన్నారన్నారు.
ఇంటర్వ్యూలు మాత్రమే జరుగుతున్నాయని, తుది ఎంపిక కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాంటప్పుడు మొత్తం ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదని, పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది విన్నవించారు. అలాగే జవాబు పత్రాలు, రికార్డులను కోర్టు ముందు ఉంచుతామని, ప్రక్రియను కొనసాగించాలని చేసిన విన్నపానికి హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
విచారణలో భాగంగా బుధవారం గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. నియమకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని సర్వీస్ కమిషన్‌కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.