నారాయ‌ణ‌, చైత‌న్య‌ల్లో ‘బ్రాయిల‌ర్’ స్టూడెంట్స్‌

కోడి చాలా పౌరుష‌మైంది. గ‌ద్ద వ‌చ్చిన‌పుడు పెట్ట పోరాటం తెలుస్తుంది. పుంజు శ‌క్తి సంక్రాంతి పందాల్లో అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచంలో ప్ర‌తి జీవికి జీవిత పోరాటం తెలుసు. మ‌నుషులు కూడా దీనికి మిన‌హాయింపు లేదు. నిరంత‌రం…

కోడి చాలా పౌరుష‌మైంది. గ‌ద్ద వ‌చ్చిన‌పుడు పెట్ట పోరాటం తెలుస్తుంది. పుంజు శ‌క్తి సంక్రాంతి పందాల్లో అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచంలో ప్ర‌తి జీవికి జీవిత పోరాటం తెలుసు. మ‌నుషులు కూడా దీనికి మిన‌హాయింపు లేదు. నిరంత‌రం మ‌నం ప్ర‌కృతి శ‌క్తుల‌తో, స‌మాజంతో ఘ‌ర్ష‌ణ ప‌డుతూ వుండాలి. యుద్ధం చేసే ల‌క్ష‌ణం ఎంతోకొంత వుంటేనే మ‌నం మ‌నుషులం.

అయితే కెరీరిజం పేరుతో మ‌న పిల్ల‌ల స‌హ‌జ శ‌క్తుల్ని మ‌న‌మే చేతులారా చంపేస్తున్నాం. ఫారాల్లో పెంచే బ్రాయిల‌ర్ కోళ్ల‌లా మారుస్తున్నాం. బ్రాయిల‌ర్ కోడికి స‌హ‌జ ల‌క్ష‌ణాలుండ‌వు. పోరాటం తెలియ‌దు. తిన‌డం, పెర‌గ‌డం. రెసిడెంట్ స్కూళ్ల‌లో పెరిగే పిల్ల‌ల‌కి చ‌ద‌వ‌డం , చ‌ద‌వ‌డం, చ‌ద‌వ‌డం ఈ మూడే ప‌నులు.

45 ఏళ్ల క్రితం చ‌దువులంటే ప్ర‌భుత్వ స్కూళ్ల చ‌దువులే. ప్రైవేట్ స్కూళ్లు వున్నా చాలా త‌క్కువ‌. ఇంజ‌నీరింగ్‌, మెడిసిన్ ఎంట్రెన్స్ కోచింగ్‌లు గుంటూరులో మొద‌ల‌య్యాయి (ర‌వి కాలేజ్‌). త‌ల్లిదండ్రుల్లో జ్వ‌రం మొద‌లైంది. కోచింగ్‌కి వెళ్ల‌డం ఓ స్టేట‌స్ సింబ‌ల్‌. మా వాడు గుంటూరులో కోచింగ్ తీసుకుంటున్నాడ‌ని చెప్పుకోవ‌డం ప్యాష‌న్‌. 1985 నాటికి ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే క‌ర్నాట‌క‌లో డొనేష‌న్లు క‌ట్టి మ‌న‌వాళ్లు చ‌ద‌వ‌డం స్టార్ట్ చేశారు.

1990 నాటికి రెసిడెన్షియ‌ల్ స్కూల్ క‌ల్చ‌ర్ మొద‌లైంది. చైత‌న్య‌, నారాయ‌ణ‌ల‌తో అది ప‌రాకాష్ట‌కు చేరింది. ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెంద‌డం వెనుక ఈ చ‌దువుల చైత‌న్యం కూడా కార‌ణం. ప‌ల్లెల్లో వ్య‌వ‌సాయాన్ని కౌలుకి ఇచ్చి కుటుంబాల‌న్నీ వ‌ల‌స‌బాట ప‌ట్టాయి. పిల్ల‌ల్ని చ‌దివించ‌డానికి న‌గ‌రాల్లో కాపురం పెట్టారు.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఈ చ‌దువులు కూడా ఒక కార‌ణం, పిల్ల‌ల్ని రెసిడెన్షియ‌ల్‌లో పెట్టి అప్పులు చేసి ఫీజులు క‌ట్టారు. వ్య‌వ‌సాయం మోసం చేయ‌డంతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.

నారాయ‌ణ‌, చైత‌న్య‌ల బ్రాయిల‌ర్ స్టూడెంట్ క‌ల్చ‌ర్ వ‌ల్ల ఏం జ‌రిగిందంటే సొసైటీ డైమెన్ష‌న్స్ మారిపోయాయి. పుస్త‌కాల చ‌దువు త‌ప్ప ఇత‌ర ఏ జ్ఞాన‌మూ లేని కొత్త జ‌న‌రేష‌న్‌ని త‌యారు చేశారు. దీని వ‌ల్ల మంచి కూడా జ‌రిగింది. రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్‌, తెలంగాణాలో నక్స‌లిజం 90 శాతం మాయ‌మైపోయాయి. ఏ రాజ‌కీయ భావ‌జాలం లేకుండా జైళ్ల‌కంటే హీనంగా వుండే హాస్ట‌ళ్ల‌లో పెరిగిన వాళ్లు సొసైటీలో ఏం జ‌రుగుతుందో ఆలోచించ‌లేరు.

త‌ల్లిదండ్రుల‌కి ఇదే కావాలి. పిల్ల‌ల మాన‌సిక శ‌క్తితో సంబంధం లేకుండా చ‌దువుల్ని రుద్దేశారు. హాస్ట‌ళ్ల‌లో తిండి స‌రిగా లేకున్నా, చావ‌బాదినా కూడా త‌ల్లిదండ్రులు అడిగే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో ఒత్తిడి భ‌రించ‌లేక ఎంద‌రో పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇవి ఆగ‌వు కూడా.

ఈ చ‌దువుల వ్యాపారంలో రెండు రాష్ట్రాల్లో బాగుప‌డిన పెద్ద సంస్థ‌లు నారాయ‌ణ‌, చైత‌న్య‌. ఒక ర‌క‌మైన రాజ‌కీయ శూన్య‌త‌ని కూడా వీళ్లు సృష్టించారు. జ‌న‌రేష‌న్ల‌నే వీళ్లు కెరీర్ ఉచ్చులో ఇరికించే స‌రికి, రాజ‌కీయాల్లోకి తెలివైన వాళ్లెవ‌రూ వ‌చ్చే దారి లేకుండా చేశారు. మూర్ఖులు, కాపీలు కొట్టి పాస‌యిన వాళ్లు, ఏ ర‌కమైన భావ‌జాలం లేని అజ్ఞానులు వ‌చ్చి రాజ‌కీయాల్లో మ‌న నెత్తిన కూచున్నారు.

ఒక‌ప్పుడు అంతోఇంతో క్రియాశీల చైత‌న్యంతో క‌మ్యూనిస్టు పార్టీలుండేవి. ఇపుడు ఆ పార్టీలు కూడా కార్య‌క‌ర్త‌ల శూన్య‌త‌తో వున్నాయి. ఒక‌ప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌త ఎంతోకొంత సామాజిక చైత‌న్యంతో క‌మ్యూనిస్టు పార్టీల వెంట వుండేవి. ఇప్పుడు వాళ్లంతా నారాయ‌ణ‌, చైత‌న్య బ్యాచ్‌లుగా మారిపోయారు. గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీల్లో విద్యార్థులు త‌గ్గిపోయారు. కొత్త త‌రానికి కెరీరిజం త‌ప్ప క‌మ్యూనిజం తెలియ‌దు.

జీఆర్ మ‌హ‌ర్షి