తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారనే వార్తలు తప్ప, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గవర్నర్ విషయంలో తెలంగాణ సర్కార్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా రెచ్చగొట్టాలని అనేక శక్తులు ప్రయత్నిస్తున్నా, ఆయన మాత్రం ప్రత్యర్థులు ఆశించినట్టు నడుచుకోవడం లేదు. తాజాగా బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
వేలాది మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తే తప్ప విరమించే ప్రశ్నే లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలపై గవర్నర్ తమిళిసై సీరియస్ కావడం గమనార్హం. విద్యార్థుల ఆందోళనలకు దారి తీసిన పరిస్థితులపై తక్షణం నివేదిక ఇవ్వాలని వీసీని గవర్నర్ ఆదేశించడం విశేషం.
వీసీల అధిపతి గవర్నరే. మరి తమ బాస్ ఆదేశాలపై వీసీ స్పందించి తగిన నివేదిక ఇస్తారా? లేక ప్రభుత్వ పెద్దల మాట ప్రకారం నడుచుకుంటారా? అనేది తెలియాల్సి వుంది. ఇటీవల జూబ్లీహిల్స్‌లో కారులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్ ఆదేశించారు. తనకు ఇంత వరకూ నివేదిక ఇవ్వాలని ఇటీవల గవర్నర్ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ను గవర్నర్ నిర్వహించారు. పలు సమస్యలపై మహిళల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తానెవరికీ భయపడనని, ఆ విషయం తెలుసుకోవాలని పరోక్షంగా ప్రభుత్వానికి ఆమె హెచ్చరికలు పంపారు.
ఈ నేపథ్యంలో గవర్నర్‌ను డమ్మీ చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలను కనీసం వీసీ అయినా పాటిస్తారా? …అనే చర్చకు తెరలేచింది.