చంద్రగిరిలో పోలీసులకు కేటాయించిన విలువైన స్థలాన్ని అధికార పార్టీ కార్యాలయానికి కేటాయించారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నోర్మూసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు దొందు దొందే అనే అసహనం చంద్రగిరి ప్రజానీకంలో కలిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని లోపాయికారి ఒప్పందంలో ఉండడం వల్లే నోరు మెదపలేదని “గ్రేట్ ఆంధ్ర” వాస్తవాన్ని కళ్లకు కట్టింది.
దీంతో చంద్రబాబు, నారా లోకేశ్‌తో పాటు పార్టీ పెద్దలు వరుసగా పులివర్తి నానికి తలంటారు. “నీ నియోజక వర్గ కేంద్రంలో పోలీసుల స్థలాన్ని అధికార పార్టీకి కేటాయించినా, ఎందుకు నోరు మెదపలేదు. విజయవాడలో ఉంటున్న వర్ల రామయ్య ఆ సమస్యపై మాట్లాడాల్సి రావడం అంటే, అది నీ ఫెయిల్యూర్ కాదా? రేపు ఇంకా ఏం చేసినా ఇట్లే వుంటావా? ఇలాగైతే మరొకరిని చూసుకోవాల్సి వస్తుంది” అని తిట్టినట్టు సమాచారం.
దీంతో తాను పిల్లి కాదు, పులే అని నిరూపించుకోవాల్సిన అవసరం పులివర్తికి ఏర్పడింది. అఖిలపక్షాన్ని వెంటేసుకుని చంద్రగిరిలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తుల్ని తీసుకుని పార్టీ కార్యాలయాలను కట్టుకుంటున్నారని విమర్శించారు. ఇదేమని ప్రశ్నిస్తే చంద్రబాబునాయుడు 2016లో ఇచ్చిన జీవో 340 గురించి మాట్లాడుతున్నారన్నారు.
ఆ జీవోలో ఏముందో ఒకసారి చదవాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు ఇవ్వాలని ఆ జీవోలో పేర్కొన్నారని నాని తెలిపారు. కానీ చంద్రగిరి జిల్లా కేంద్రం కాదన్నారు. తిరుపతి జిల్లా కేంద్రమన్నారు. ఇస్తే తిరుపతిలోనే ఇవ్వాలన్నారు. చంద్రగిరిలో పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వడాన్ని కూడా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడని స్థలాలను ఇవ్వొచ్చన్నారు.
ఈ రోజు పేద ప్రజలకు ఇంటి స్థలాలు మాత్రం కొండలు, గుట్టల్లో ఇస్తున్నారన్నారు. కానీ అధికార పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు స్థలం ఎక్కడిస్తున్నారో ఒక్కసారి మనస్సాక్షి వుంటే ఆలోచించాలని అధికారులకు సూచించారు. మంగళంలో పోలీసులకు ఇస్తామంటున్న స్థలంలోనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలని సూచించారు. చంద్రగిరిలో పోలీసులకు ఇచ్చిన స్థలాన్ని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని హెచ్చరించారు.