తను డిసైడ్ అయ్యింది సరే ….మిగతా అభ్యర్థులు దొరుకుతారా?

వాస్తవానికి తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు జరగాలి. కానీ ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే అంచనాలూ ఉన్నాయి. కేసీఆర్ ఎలా నిర్ణయిస్తారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఉంది. కానీ దీంతో నిమిత్తం లేకుండానే,…

వాస్తవానికి తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు జరగాలి. కానీ ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే అంచనాలూ ఉన్నాయి. కేసీఆర్ ఎలా నిర్ణయిస్తారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఉంది. కానీ దీంతో నిమిత్తం లేకుండానే, ఆ విషయాలేవీ పట్టించుకోకుండానే వైఎస్సార్టీపీ అధినేత షర్మిల తన పని తాను చేసుకుంటూపోతోంది. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలో కూడా ఇప్పుడే నిర్ణయించుకుంది. ఆమె తెలంగాణలో అడుగు పెట్టినప్పటినుంచి ఖమ్మం జిల్లా అంటే ఆమెకు అభిమానం ఎక్కువ. ఆమె తన పార్టీ పేరును కూడా అక్కడి నుంచే ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న షర్మిల..రానున్న ఎన్నికల పైన ఫోకస్ పెట్టింది. పార్టీ ఏర్పాటు ద్వారా..తన తండ్రి హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ప్రజలతో మమేకం అవుతోంది. ఇదే సమయంలో షర్మిల పార్టీ ఏర్పాటు తరువాత అంచనా వేసిన విధంగా పెద్ద స్థాయి నాయకులు ఎవరూ వైఎస్సార్టీపీలో చేరలేదు. అయితే, తనకు నేతలు అవసరం లేదని..తనతో కలిసొచ్చే వారే నేతలుగా ఎదుగుతారని షర్మిల చెప్పింది. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకుంటోంది.  పాలేరుతోపాటుగా హైదరాబాద్ నగర పరిధిలోని మరో అసెంబ్లీ నియెజకవర్గం పైనా ఫోకస్ పెట్టిందని పార్టీలో ప్రచారం సాగుతోంది. కానీ, అన్ని కోణాల్లో పరిశీలన చేసిన తరువాత పాలేరు పైనే షర్మిల ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. 

ఈ నియోజకవర్గంలో షర్మిల టీం ప్రత్యేకంగా స్థానికుల సమస్యలు.. షర్మిల వారికి దగ్గరయ్యేలా ఎలా ముందుకు వెళ్లాలనే దాని పైన కసతర్తు ప్రారంభించింది. షర్మిల రాజకీయంగా తొలి సారి చట్ట సభలకు పోటీ చేస్తున్న నియోజకవర్గం కావటంతో..అక్కడ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తోంది. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర దాటేసింది.  ప్రజాస్పందనతో పని లేకుండా పాదయాత్ర చేస్తోంది. వైఎస్సార్టీపీని బలోపేతం చేసే దిశగా ఆమె ఎన్నికలకు రెండేళ్ల ముందే పాదయాత్రను ప్రారంభించింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆమె నిప్పులు చెరుగుతోంది. పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. 2016 ఉప ఎన్నికల్లో తప్ప అక్కడ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది.

అందుకే వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది. పాలేరులో అయితే సులువుగా గెలుపు అవకాశాలుంటాయని ఆమె భావిస్తోంది. పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కూడా నేలకొండపల్లిలో జరగనుంది. వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తే తొలి సారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసినట్లవుతుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా షర్మిల ఇంతవరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక తన పార్టీ అభ్యర్థులను కూడా ఆరు నెలల ముందు ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతోంది. కానీ ఆమె పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరుకుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటి వరకూ తెలంగాణలో షర్మిల పార్టీని కానీ, ఆమె పాదయాత్రను కానీ పట్టించుకున్న పార్టీ కానీ నేత కానీ లేరు. 

ఆమె మానాన ఆమె కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ నిరశనలు, పాదయాత్రతో రాష్ట్రంలో ఒంటరి ప్రయాణం చేస్తోంది. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతలు రెచ్చిపోయారు. నానా మాటలు అన్నారు. తెలంగాణతో ఆమెకు ఏం సంబంధమని దుర్భాషలాడారు. ఆంధ్రా వాళ్ళు మళ్ళీ దోచుకోవడానికి వస్తున్నారని అన్నారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ నేతలు కూడా షర్మిలను వ్యతిరేకించారు. వీళ్ళ  విమర్శలకు జవాబుగా తాను తెలంగాణా కోడలినని, తనకు ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉందని గట్టిగా మాట్లాడింది. కేసీఆర్ మీద ఘాటు విమర్శలు మొదలు పెట్టింది. ఆమె పాదయాత్రలను, టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలను పట్టించుకున్న పాపాన పోలేదు.

వైఎస్సార్ టీపీని రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో చీలిక కోసం టీఆర్ఎస్ కోసం, టీఆర్ఎస్ చేత, టీఆర్ఎస్ వలన ఆవిర్భవించిన పార్టీగానే పరిగణించారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఇప్పటివరకు షర్మిల పార్టీలో బలమైన నాయకులు లేరు. ఇతర పార్టీల నుంచి వలసలు కూడా లేవు. షర్మిల ఒక్కతే ఒంటరి పోరాటం చేస్తోంది. ఇప్పటివరకు పార్టీ నిర్మాణం జరగలేదు. బలమైన కేడర్ లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అభ్యర్థులు దొరుకుతారా?