ఎద్దు ఈనింది… గాటికి క‌ట్టేసిన ఉమా!

టీడీపీ నేత‌ల్ని ఎల్లో మీడియా త‌ప్పుదారి ప‌ట్టిస్తోంది. ఎల్లో ప‌త్రిక క‌థ‌నాల్ని న‌మ్మి, రైతులంద‌రినీ అధికార పార్టీకి చెందిన వారిగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ జ‌మ‌క‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప్ర‌భుత్వ ల‌బ్ధి పొందితే చాలు……

టీడీపీ నేత‌ల్ని ఎల్లో మీడియా త‌ప్పుదారి ప‌ట్టిస్తోంది. ఎల్లో ప‌త్రిక క‌థ‌నాల్ని న‌మ్మి, రైతులంద‌రినీ అధికార పార్టీకి చెందిన వారిగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ జ‌మ‌క‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప్ర‌భుత్వ ల‌బ్ధి పొందితే చాలు… నిజానిజాల‌తో సంబంధం లేకుండానే వైసీపీ ముద్ర వేయ‌డం త‌మ‌కే న‌ష్టం క‌లిగిస్తుంద‌నే వాస్త‌వాన్ని టీడీపీ నేత‌లు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంగ‌ళ‌వారం 15.61 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.2,977.82 కోట్ల బీమా ప‌రిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జ‌మ చేశారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతుల‌కు ఈ ప‌రిహారం అందుతుంది. ఈ సొమ్ము రైతుల‌కు విడ‌త‌ల‌వారీగా ఒక‌ట్రెండు రోజుల్లో జ‌మ అవుతుంది.

అయితే అస‌లు వాస్త‌వం ఇలా వుంటే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేసినా వ‌క్ర‌భాష్యం చెప్ప‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న‌ ఆ ప‌త్రిక… ఇవాళ ప‌రిహారం పంపిణీపై త‌న మార్క్ అనుమానాన్ని వ్య‌క్తం చేస్తూ క‌థ‌నం రాసింది.

రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో పంటలు వేసిన రైతులు 49 లక్షల మంది అని, వీరిలో పంట నష్టపరిహార బీమాకు అర్హులుగా గుర్తించింది 29లక్షల మందిని రాసుకొచ్చారు. అయితే మిగిలిన 20 లక్షల మందిని ఎందుకు వదిలేశారని అడగొద్ద‌ని త‌న అనుమానాన్ని పాఠ‌కుల‌పై రుద్దే ప్ర‌య‌త్నాన్ని గుర్తించొచ్చు. అయితే 15.61 లక్షల మందికి మాత్ర‌మే ప‌రిహారం అందిస్తున్నార‌ని, మిగిలిన 14 లక్షల మంది పంటలు నష్టపోలేదా… అని అడగొద్దంటూ త‌న‌కు తానే ప్ర‌శ్నించుకోవ‌డం గ‌మ‌నార్హం. చివరికి… 15.61 లక్షల మందిలో ఎంతమంది ఖాతాల్లో బీమా పరిహారం పడిందంటే… అదో పెద్ద ‘అనుమానాస్పదం!’ అంటూ స‌ద‌రు ప‌త్రిక రాయ‌డం, దాన్ని న‌మ్మి మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేయ‌డం విశేషం.

‘క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రైతుల కోసమా?. మీ పార్టీ నేతల కోసమా?. పంటల బీమా చెల్లింపుల్లో అన్నీ అవకతవకలే. వైసీపీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతున్న వ్యవహారం. లక్షల మంది అసలు రైతులకు అందని పరిహారం. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను మీ నేతలు ధీమాగా కొల్లగొడుతున్నారంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారు? సీఎం జగన్’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

ఒక‌వైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రైతులు అస‌హ‌నంగా ఉన్నార‌ని ప్ర‌చారం చేస్తూ, మ‌రోవైపు 15.61 ల‌క్ష‌ల మంది రైతులు వైసీపీనే అని టీడీపీ నేత చెప్ప‌డం అంటే…. ఇది అధికార పార్టీకి లాభ‌మా? న‌ష్ట‌మా? జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా ఈ-క్రాఫింగ్ చేస్తోంది. స‌చివాల‌యాల్లోని వ్య‌వ‌సాయ అధికారి, రెవెన్యూ అధికారులు నేరుగా పొలాల వ‌ద్ద‌కు వెళ్లి, రైతుల‌తో స‌హా పంట‌ల్ని కూడా ఫొటో తీసిన త‌ర్వాతే పంట‌ల బీమా చెల్లిస్తున్నారు. ఇందులో మోసానికి తావులేదు.

పంట వేయ‌క‌పోతే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌నే తేడా వుండ‌దు. పంట‌లు వేయ‌ని వారెవ‌రికీ బీమా ద‌క్క‌దు. కానీ మూడేళ్ల‌కు ముందు ఇలా వుండేది కాదు. రైతులు త‌మ‌కు తామే పంట‌ల బీమా చెల్లించే వారు. ఆ ప‌ద్ధ‌తికి ప్ర‌స్తుత ప్ర‌భుత్వం స్వ‌స్తి చెప్పింది. పంట‌లు వేయ‌కుండానే, వేసిన‌ట్టు ల‌క్ష‌లాది రూపాయ‌లు బీమా సొమ్ము పొందే రోజుల‌కు కాలం చెల్లింది. 

ఇది కొంద‌రికి రుచించ‌డం లేదు. ఎవ‌రైతే పంట‌ల బీమా రాలేద‌ని చెబుతున్నారో, నిజంగా వాళ్లు పంట సాగు చేశారా? అనేది ఆ గ్రామ వ్య‌వ‌సాయాధికారి నిర్ధారిస్తారు. ఎద్దు ఈనింద‌ని ఎల్లో ప‌త్రిక క‌థ‌నం రాస్తే… గాటికి క‌ట్టేయ‌మ‌న్న‌ట్టు దేవినేని ఉమా ట్వీట్ ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.