వైసీపీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆనందానికి అవధుల్లేవు. దీనికి కారణం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీని ఈడీ విచారించడమే.
కేంద్రంలో యూపీఏ అధికారంలో వున్నప్పుడు సీబీఐ, ఈడీ విచారణలు జరిపి వైఎస్ జగన్‌తో పాటు తనను 16 నెలల పాటు జైల్లో ఉంచడాన్ని విజయసాయిరెడ్డి మరిచిపోలేకున్నారు. గాంధీ కుటుంబ సభ్యులపై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
సోనియాగాంధీకి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రాహుల్‌గాంధీ మాత్రం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ఈడీ విచారించడంపై ఘాటుగా స్పందించారు.
‘కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందే’ అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని విజయసాయిరెడ్డి సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. సుబ్రమణ్య స్వామి వేసిన పిల్‌పైనే విచారణ జరుగుతోందని, రాజకీయాలు ఆపాదించడం తగదని కాంగ్రెస్‌కు విజయసాయిరెడ్డి హితవు చెప్పారు. బీజేపీకి మద్దతుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
గతంలో వైఎస్ జగన్ అక్రమాలపై కాంగ్రెస్, టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకే వైఎస్ జగన్‌తో పాటు విజయసాయిరెడ్డిలపై విచారణ, అనంతరం అరెస్ట్ తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమను కాదని జగన్ సొంత కుంపటి పెట్టుకోవడం వల్లే సోనియాగాంధీ కక్ష కట్టి కటకటాలపాలు చేసిందని వైసీపీ నేతల విమర్శ.