కొత్తగా పార్టీ స్థాపించడం, పోటీ చేసేందుకు ప్రసిద్ధ హిందూ ఆధ్మాత్మిక కేంద్రం తిరుపతిలో పోటీ చేయాలని సినీ సెలబ్రిటీలు ఉత్సాహం చూపుతుంటారు. అయితే తిరుపతి ప్రజలు అభిమానంతో వారిని ఎన్నుకోవడం, కనీసం కాలపరిమితి పూర్తి కాకుండానే రాజీనామాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా 2024లో తిరుపతి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన గెలిస్తే, ఎన్టీఆర్, అన్న చిరంజీవి బాటలోనే పయనిస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడీ విషయమై తిరుపతిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత 1983లో జరిగిన తొలి ఎన్నికల్లో కృష్ణా జిల్లా గుడివాడ, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల గెలుపొందారు. తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన సొంత నియోజకవర్గమైన గుడివాడలోనే కొనసాగారు.
1983లో తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి కత్తుల శ్యామల గెలుపొందారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లులో పోటీ చేశారు. సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో నిరాదరణ, రాయలసీమ గడ్డపై ఉన్న తిరుపతి అక్కున చేర్చుకుంది. 2009లో ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆకస్మిక మరణం, ఆ తర్వాత పెను రాజకీయ మార్పుల నేపథ్యంలో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. యూపీఏ-2లో చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు.
ఎమ్మెల్యే పదవికి చిరంజీవి రాజీనామాతో 2012లో తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వెం.వెంకటరమణపై గెలుపొందారు. ఈ నేపథ్యంలో పవన్ పోటీపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్‌ని గెలిపిస్తే కనీసం ఆరు నెలలు కూడా కొనసాగలేదని, చిరంజీవి మాత్రం గుడ్డిలో మెల్ల అన్నట్టు దాదాపు మూడేళ్లు కొనసాగారనే చర్చ జరుగుతోంది.
తమ రాజకీయ అవసరాల కోసం తిరుపతిలో పోటీ చేయడం, ఆ తర్వాత రాజీనామా చేసి వెళ్లిపోయి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. 2024లో పవన్ పోటీ చేసినా, వాళ్లిద్దరి కంటే భిన్నంగా వ్యవహరించరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తిరుపతితో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేసేందుకు పవన్ సురక్షిత ప్రాంతాన్ని ఎంచుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.
గత చేదు అనుభవాలను దృష్టిలో స్థానిక నాయకులను కాదని, సినిమా వాళ్లను ఎన్నుకుని ఇబ్బంది పడడమా? లేక మెరుగైన నిర్ణయం తీసుకోవడమా? అనేది చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా తిరుపతిలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం మాత్రం అనేక అంశాలను తెరపైకి తీసుకొస్తూ… తీవ్ర చర్చనీయాంశమవుతోందన్నది నిజం.