డ్రీమ్ మ‌ర్చెంట్స్‌

అన్ని త‌మ చేతిలో ఉన్నా కూడా ఇంకెవ‌రి మీదో నింద‌లు వేస్తూ వుంటారు మ‌న నాయ‌కులు. న‌ల్ల ధ‌నాన్ని బ‌య‌టికి తెస్తా, అప్పులు ఎగ్గొట్టిన వాళ్ల అంతు తేలుస్తా అన్నాడు మోదీ. అన్ని ద‌ర్యాప్తు…

అన్ని త‌మ చేతిలో ఉన్నా కూడా ఇంకెవ‌రి మీదో నింద‌లు వేస్తూ వుంటారు మ‌న నాయ‌కులు. న‌ల్ల ధ‌నాన్ని బ‌య‌టికి తెస్తా, అప్పులు ఎగ్గొట్టిన వాళ్ల అంతు తేలుస్తా అన్నాడు మోదీ. అన్ని ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆయ‌న చేతిలోనే వున్నాయి. ఎనిమిదేళ్లైనా తేల్చింది ఏమీ లేదు. శ‌క్తులు ఉడిగిపోయి మూల‌కూచున్న కాంగ్రెస్‌ని ఇంకా తిడుతూ వుంటాడు. 

మ‌న సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌తిదానికి టీడీపీతో పోల్చుతూ వుంటాడు. సాక్షిలో అయితే కంపారిజ‌న్ చార్ట్ వేస్తారు. గ‌తం స‌రిగా లేద‌నే క‌దా మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌ది. కోన‌సీమ అల్ల‌ర్ల‌కు టీడీపీ కార‌ణ‌మ‌ని ముఖ్య‌మంత్రే తేల్చేశారు. మ‌రి పోలీస్‌, ఇంటెలిజెన్స్ అన్నీ మీ చేతికిందే క‌దా ఉన్నాయి! నిందితుల‌ను వేగంగా అరెస్ట్ చేసి, శిక్ష‌లు ప‌డేలా చేయాలి క‌దా! మంత్రి ఇల్లే త‌గ‌ల‌బెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్న‌ట్టు?

జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం అధ్వాన్నం అని బాబు అంటూ వుంటాడు. త‌మ‌రి ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రానికి ఏం ఒరిగింది. అమ‌రావ‌తి పేరుతో టైంపాస్ చేసారు, బాబు రాక‌పోతే అభివృద్ధి ఆగిపోతుంద‌నే భ‌యంతో జ‌నం మ‌ళ్లీ ఓట్లు వేస్తార‌నుకున్నారు. వేయ‌లేదు. ప్ర‌తిప‌క్షంలో కూచున్నారు.

సామాజిక మార్పు తెస్తానని, ప్ర‌జ‌ల జీవితాలు మారుస్తాన‌ని ప‌వ‌న్ వ‌స్తున్నారు. ఇంత కాలం త‌మ‌రిని ఎవ‌రైనా ఆపారా? ప్ర‌శాంతంగా సినిమాలు తీసుకుంటూ ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి మాట‌లు చెబితే జ‌నం న‌మ్ముతారా?  రెండు ద‌శాబ్దాలుగా రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నాయి. హ‌ఠాత్తుగా ఇప్పుడే గుర్తొచ్చాయా?  మొత్తం ఎన్నిక‌ల స్టంట్‌.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని మోదీ అంటున్నాడు. ఎక్క‌డి నుంచి తెస్తాడు? సైన్యంలోనే ఖ‌ర్చుకి భ‌య‌ప‌డి పార్ట్‌టైం సైనికుల్ని తీసుకుంటున్నారు. దానికే దిక్కులేదు. మ‌రి ఇక్క‌డ ఎలా ఇస్తారు?

జ‌గ‌న్ కొత్త‌గా ఏమీ వాగ్దానాలు చేయ‌క్క‌ర్లేదు. చేసినా జ‌నం న‌మ్మ‌రు. ఒక‌టో తేదీ జీతాలిచ్చి, రిటైర్ అయిన వారికి వెంట‌నే బెనిఫిట్ ఇచ్చి, రోడ్డు గుంత‌లు పూడ్చి (కొత్త రోడ్డు సంగ‌తి దేవుడెరుగు!) ఇవ్వాల్సిన వాళ్లంద‌రికీ బిల్లులు ఇస్తే చాలు.

ఇక చంద్ర‌బాబు గ్రాఫిక్స్ అంద‌రికీ తెలుసు. జ‌గ‌న్ చేసే త‌ప్పుల‌తో మ‌ళ్లీ రావాల‌నే ఆలోచ‌న త‌ప్ప, ఆయ‌న‌కి ఎజెండా లేదు. బాబుని న‌మ్మ‌రు. ఎంత అమాయ‌కులైనా ఎన్నిసార్లు న‌మ్ముతారు?

ప‌వ‌న్‌కి ఏ ప్ర‌ణాళికా లేదు. గ్లామ‌ర్‌తో, జ‌గ‌న్ వ్య‌తిరేక‌త‌తో గెల‌వాల‌నే కోరిక త‌ప్ప‌. జ‌గ‌న్‌ని నిందించే ప‌వ‌న్, రాష్ట్రాన్ని బాగు చేయ‌డానికి తానేం చేస్తాడో చెప్పాలి. డైలాగ్‌లు సినిమాల్లో బాగుంటాయి. రాజ‌కీయాల్లో చెల్ల‌ని నాణాలు.

వీళ్లంతా డ్రీమ్ మ‌ర్చెంట్స్‌. క‌ల‌ల వ్యాపారులు. ఎంత విలువైన క‌ల‌ని క‌న్నా అది తెల్లారేస‌రికి వుండ‌దు.

జీఆర్ మ‌హ‌ర్షి