బాబు-పవన్ పొత్తు.. జగన్ కి అంతిష్టమా..?

చంద్రబాబు వన్ సైడ్ లవ్ అన్నారు, పవన్ బాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోనన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. మహానాడు తర్వాత గ్యాప్ మరింత…

చంద్రబాబు వన్ సైడ్ లవ్ అన్నారు, పవన్ బాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోనన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. మహానాడు తర్వాత గ్యాప్ మరింత పెరిగింది. 2024 నాటికి టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయా, చేయవా అనేది సందిగ్ధంలోనే ఉంది. 

వైసీపీ నాయకులు మాత్రం దమ్ముంటే సింగిల్ గా రండి, పొత్తుల్లేకుండా పోటీ చేయండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. కానీ జగన్ కి మాత్రం పవన్, బాబు పొత్తు పెట్టుకుంటే మరోసారి చూడాలన్నట్టుగా ఉంది. అందుకే ఆయన పదేపదే దత్తపుత్రుడు అనే పద ప్రయోగం చేస్తున్నారు. బలవంతంగా అయినా సరే నేను చంద్రబాబు దత్తపుత్రుడినే అని పవన్ ఒప్పుకునే వరకు జగన్ వదిలిపెట్టేలా లేరు.

ఓటమి కారణాలు వెదుక్కోవడంలో చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఎవరూ ఎవరికి తీసిపోరు. జగన్ ఒక్క ఛాన్స్ అడిగారు, అందుకే జనం ఓటేశారని చెప్పే చంద్రబాబు, తన అసమర్థతను మాత్రం ఎప్పటికీ ఒప్పుకోరు. 

పదే పదే పొత్తులతో ఓడిపోయాం, ఒకప్పుడు ఆయన కోసం తగ్గాను, ఆ తర్వాత ఈయన కోసం తగ్గాను.. అసలు తగ్గకపోతే నేనేంటో చూపించేవాడ్ని అంటూ గప్పాలు చెబుతారు పవన్. అంతే కానీ, తనకున్న బలమెంత, తన పార్టీకున్న ఓటు బ్యాంకు ఎంత అనేది పవన్ ఎప్పుడూ అంచనా వేయరు. వేసినా బయటకు చెప్పరు. ఈసారి మాత్రం టీడీపీ, జనసేన కలిస్తే తిరుగే లేదనే అంచనాలో ఉన్నారు.

కలిసొచ్చినా తగ్గేదే లేదు..

వైసీపీ నేతలు దమ్ముంటే సింగిల్ గా రండి అని సవాళ్లు విసురుతున్నారు కానీ, జగన్ పాయింటే కరెక్ట్ అనిపించేలా ఉంది. కలసి రానివ్వండి తప్పేముంది, నాకు జనబలం ఉంది అనే ధీమాతో ఉన్నారు సీఎం జగన్. 

కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా 2024లో మరింత గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే పవన్ ని పదే పదే దత్తపుత్రుడు అని ర్యాగింగ్ చేస్తున్నారు. తానెవరికీ దత్తపుత్రుడిని కాను అని చెప్పుకుంటున్న పవన్, రేపు పొత్తులు ఖరారైతే.. తనకు తానుగా దత్తపుత్రుడిని అని అంగీకరించినట్టే లెక్క. జగన్ కామెంట్లను ఒప్పుకున్నట్టే అనుకోవాలి.

అటు జగన్ ర్యాగింగ్ ని తట్టుకోలేక, ఇటు చంద్రబాబుకి దూరంగా ఉండలేక పవన్ మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారని మాత్రం అర్థమవుతోంది. మొత్తమ్మీద బాబు, పవన్ కలిసొచ్చినా.. వైసీపీని ఎదుర్కోలేరనే మెసేజ్ ని, ఎలాంటి పోటీకైనా వైసీపీ భయపడబోదనే మెసేజ్ ని గట్టిగా జనాల్లోకి పంపిస్తున్నారు జగన్.