విశాఖకు ఇన్ఫోసిస్… ఐటీ రాజధాని దిశగా అడుగులు

విశాఖ ఐటీ రాజధాని అని గత పాలకులు అన్నారు. ఇక దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారా తీసుకుంటే అవి ఎంత మేరకు ఫలితాలు ఇచ్చాయి అన్నది చూస్తే నిరాశ కలుగుతుంది. ఇదిలా ఉంటే విశాఖను…

విశాఖ ఐటీ రాజధాని అని గత పాలకులు అన్నారు. ఇక దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారా తీసుకుంటే అవి ఎంత మేరకు ఫలితాలు ఇచ్చాయి అన్నది చూస్తే నిరాశ కలుగుతుంది. ఇదిలా ఉంటే విశాఖను ఐటీలో మేటిగా చేద్దామనుకున్నామని తెలుగుదేశం పార్టీ వారు ఎపుడూ చెబుతూంటారు. కానీ జరిగింది బహు తక్కువ.

ఇక తాము దిగిపోయాక విశాఖ ఐటీ రూపురేఖలు మటుమాయం అయ్యాయని కూడా తరచూ ఆరోపిస్తూంటారు. కానీ ఇపుడు ఒక దిగ్గజ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ తన కార్యాలయాన్ని విశాఖ సిటీలో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఐటీ వర్గాలలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇన్ఫోసిస్ లాంటి సంస్థ విశాఖకు వస్తే కచ్చితంగా అది ఐటీ రూపురేఖలు మార్చే పరిణామానికి దారితీస్తుందని అంటున్నారు. అదే విధంగా చూస్తే ఇన్ఫోసిస్ రాకతో తక్షణం వేయి మందికి దాకా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు తమ దారిని విశాఖ వైపుగా మళ్ళించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

వైసీపీ సర్కార్ ఏలుబడిలో విశాఖకు ఒక దిగ్గజ సంస్థ రావడం మాత్రం శుభ పరిణామంగా ఆ పార్టీ వారు చెప్పుకుంటున్నారు. విశాఖ నుంచి ఐటీ సంస్థలు వెళ్ళిపోతున్నాయి అని ఇప్పటిదాకా పెద్ద ఎత్తున  విమర్శలు చేసే విపక్షం టీడీపీ దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా విశాఖ ఐటీకి మాత్రం ఇది కీలకమైన పరిణామంగానే అంతా చూస్తున్నారు.