నాని నటించిన తాజా చిత్రం 'అంటే సుందరానికీ'. ఈ సినిమాను ఆవకాయ్ తో పోల్చాడు నాని. ఆవకాయ్ రుచి రోజురోజుకు పెరుగుతుందని, అలా తమ సినిమా రోజురోజుకు బెటర్ అవుతుందన్నాడు. అక్కడితో ఆగకుండా 2-3 ఏళ్లు గడిచిన తర్వాత మంచి సినిమాలు చెప్పమంటే అందులో 'అంటే సుందరానికీ' ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. కానీ నాని చెప్పిన ఆవకాయ కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
'అంటే సుందరానికీ' సినిమా మొదటి 3 రోజులు మాత్రమే బాగా ఆడింది. డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. సోమవారం నుంచి ఈ సినిమా దారుణంగా పడిపోయింది. మొదటి 3 రోజులతో పోల్చి చూస్తే ఆక్యుపెన్సీ 70 శాతం తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి.
ఇక వసూళ్ల పరంగా చూసుకుంటే.. సోమవారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 70 లక్షల షేర్ వచ్చింది. నిన్న మంగళవారం షేర్ ఇంకాస్త తగ్గింది. ఈ వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం దాదాపు అసాధ్యం అని ట్రేడ్ తేల్చేసింది.
నిడివి ఎక్కువైంది, ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉందనే విమర్శలు మినహాయిస్తే.. 'అంటే సుందరానికీ' సినిమాపై ఎక్కువమందికి పాజిటివ్ ఒపీనియర్ ఉంది. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. అయినప్పటికీ సోమవారం నుంచి ఈ సినిమా దారుణంగా పడిపోవడం చర్చకు తావిచ్చింది. ప్రేక్షకులు సినిమాల్ని థియేటర్లలో కంటే ఓటీటీలో చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతున్నారా అనే వాదన తెరపైకొచ్చింది.
పోనీ ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయిందనుకుంటే విక్రమ్ సినిమా రన్ దానికి భిన్నంగా ఉంది. ఈ సినిమాకు వీక్ డేస్ లో కూడా వసూళ్లు బాగున్నాయి. మరి నాని సినిమాకు ఎందుకిలా అయిందనేది అందరి అనుమానం. మరో 2 రోజుల్లో రానా నటించిన విరాటపర్వం థియేటర్లలోకి వస్తోంది.
'అంటే సుందరానికీ' సినిమా కంటే విరాటపర్వం సినిమాకు మొదటి వారాంతం ఓపెనింగ్స్ బాగా వస్తే, 'అంటే సుందరానికీ' కంటెంట్ వీక్ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా జరగపోతే నానిది దురదృష్టం అనుకోవాలి. మొత్తమ్మీద ఈ సినిమా ఇటు నానికి, అటు మైత్రీ మూవీ మేకర్స్ కు చిన్నపాటి షాక్ ఇచ్చేలా ఉంది.