పులివర్తి నాని… చిత్తూరు పార్లమెంట్‌తో పాటు చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్. టీడీపీ అధినేత చంద్రబాబుకు సమీప బంధువు. చంద్రబాబు పుట్టిన గడ్డపై టీడీపీని కాపాడే బాధ్యత ఈ నానీదే. అయితే అధినేత నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడని పులివర్తి నానిపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అధికార పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని చంద్రబాబు, లోకేశ్‌లను మోసగిస్తున్నాడని టీడీపీ కార్యకర్తలు, నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకుల ఆరోపణ.
తాజాగా చంద్రగిరిలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పోలీస్క్వార్టర్స్ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించడం వివాదానికి దారి తీసింది. ఇది ప్రభుత్వ స్థలం. సుమారు 70-80 ఏళ్ల క్రితం పోలీస్‌శాఖకు కేటాయించారు. అయితే వైసీపీ కార్యాలయ నిర్మించాలనే ఆలోచన అధికార పార్టీ నేతల్లో మెదలగానే, సదరు పోలీస్ శాఖ స్థలంపై కన్ను పడింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పార్టీ కార్యాలయానికి చకచకా పావులు కదిపారు. రాజు తలచుకుంటే… అనే సామెత చందాన చెవిరెడ్డి సాధించలేనిదేదీ లేదు.
చంద్రగిరిలో విలువైన పోలీస్‌శాఖ స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలానికి ప్రత్యామ్నాయంగా అదే నియోజకవర్గం మంగళంలో రెండెకరాల స్థలం పోలీస్‌శాఖకు కేటాయిస్తామని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. అలాగే జిల్లా కలెక్టరేట్ పరిసరాల్లో స్థలం కావాలని పోలీస్‌శాఖ కోరిందని, అందుకు తగ్గట్టు పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పారు.
తన నియోజకవర్గంలో సుమారు 70 కోట్ల విలువైన పోలీస్‌శాఖ స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తే, నోర్మూసుకుని కూచోవడం ఏంటని పులివర్తి నానిని టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పులివర్తి స్పందించకపోవడంతో విజయవాడలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇవాళ మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది.
వర్ల రామయ్య మాట్లాడుతూ ప్రజల ధన, మాన ప్రాణాలు, శాంతిభద్రతలు సజావుగా కాపాడటం కోసం ఉన్న పోలీసు శాఖ వారి ఆస్తులనే కాపాడుకోలేని దుస్థితిలో ఉందని ఘాటుగా విమర్శించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి గ్రామంలో పోలీసు శాఖకు సంబంధించిన స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడం దారుణమన్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఆ స్థలం పోలీసు శాఖ ఆధీనంలో ఉన్నప్పటికి దానిని అధికార పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ జీవో ఎంఎస్ నెం. 367 విడుదల చేయటం ఏంటని నిలదీశారు.
ఇదే సందర్భంలో టీడీపీ చంద్రగిరి ఇన్చార్జ్ పులివర్తి నాని నోరెందుకు తెరవలేదో వర్ల రామయ్య ఆలోచించాల్సి వుంది. నాని ఇంటిపేరులో పులి తప్ప, ఆయన ప్రజాసమస్యలపై పోరాటాలు చేయడంలో వర్తీ కాదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తుండం గమనార్హం. ఆయన “పిల్లి”వర్తి నాని అని చంద్రగిరి టీడీపీ కార్యకర్తలు ముద్దుగా పిలుచుకుంటున్నారు.