విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఆయన ఈసారి వస్తున్నది ఎందుకంటే విప్లవ జ్యోతిగా పేరు గడించి తెల్ల దొరలను గడగడలాడించిన స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజును విశాఖ నడిబొడ్డున స్మరించుకునేందుకు. ఇక చూస్తే జూలై 4న మోడీ విశాఖ పర్యటన ఖరారు అయింది. ఆయన ఆ రోజు సాయంత్రం నేరుగా భీమవరం నుంచి విశాఖకు వస్తారు.
సాయంత్రం విశాఖలో భారీ బహిరంగసభలో మోడీ ప్రసంగిస్తారు. అల్లూరికి ఘన నివాళి అర్పిస్తారు. మోడీ అధికారిక పర్యటన ఖరారు కావడంతో ఇటు పార్టీ వర్గాలు అటు అధికార వర్గాలు కూడా హడావుడి పడుతున్నాయి. మోడీ విశాఖకు వచ్చి మూడేళ్ళకు పైగా సమయం అయింది.
ఆయన చివరిసారిగా 2019 ఫిబ్రవరిలో విశాఖకు వచ్చారు. నాడు విశాఖకు రైల్వే జోన్ ఇచ్చామని చెబుతూ ఒక జీవోను సభలో చూపించి ఆ విషయాన తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని చెప్పారు. ఇక ఆ తరువాత ఎన్నికలు జరగడం, మళ్ళీ మోడీ ప్రధాని కావడాం జరిగాయి. ఈ మూడేళ్లలో విశాఖకు రైల్వే జోన్ రాలేదు సరికదా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం కాబోతోంది.
దాంతో ఏడాదికి పైగా విశాఖలో ఉక్కు ఉద్యమం సాగుతోంది. ఈ నేపధ్యంలో మోడీ విశాఖలో అడుగుపెడుతున్నారు. ఆయన విశాఖ ఉక్కు వేటు మీద ఏం చెబుతారా అన్న ఆసక్తి ఉంది. అదే విధంగా ప్రధాని వస్తే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అని గట్టిగా ఆయన ఎదుటే నినదిస్తామని ఉక్కు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
మరి మోడీ మనసులో మాటలు ఏమిటి, ఆయన మన్ కీ బాత్ ని విశాఖ వేదికగా వినేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.